మల్కాజ్గిరి:
మల్కాజ్గిరి నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్య సేవలను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో చేపడుతున్న సఫిల్‌గూడ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ (UPHC) నిర్మాణ పనులను ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
కమిషనర్ ఆఫ్ పోలీస్ కార్యాలయం వెనుక భాగంలో కొనసాగుతున్న UPHC నిర్మాణ ప్రదేశానికి చేరుకున్న ఎమ్మెల్యే పనుల పురోగతిని సంబంధిత అధికారులు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. నిర్మాణంలో ఉపయోగిస్తున్న సామగ్రి, పనుల నాణ్యత, పూర్తయిన పనులు, మిగిలిన పనుల వివరాలను పరిశీలించారు.
ప్రజలకు ఉపయోగపడే వైద్య కేంద్రం కావడంతో నిర్మాణ పనుల్లో ఎలాంటి నాణ్యతా లోపాలకు తావు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. నిర్ణీత ప్రమాణాలను పాటిస్తూ పనులను వేగవంతంగా పూర్తి చేసి, వీలైనంత త్వరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. సఫిల్‌గూడ, పరిసర ప్రాంతాల ప్రజలకు స్థానికంగానే మెరుగైన ప్రాథమిక వైద్య సేవలు అందుబాటులోకి రావడం ఎంతో ప్రయోజనకరమని అన్నారు. చిన్నపాటి అనారోగ్య సమస్యలకు దూర ప్రాంతాల్లోని ఆసుపత్రులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగా వైద్య సేవలు అందేలా UPHC ఉపయోగపడుతుందని తెలిపారు.
ప్రజలకు అవసరమైన వైద్య మౌలిక వసతులను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఆరోగ్య సేవలు ప్రజల ఇంటి ముంగిటకు చేరేలా అవసరమైన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు జేఏసీ వెంకన్న, హేమంత్ పటేల్, గౌస్ ఇమ్రాన్, బంటి, మాశెట్టి అనిల్, నర్సింగ్ రావు, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


