మల్కాజ్గిరి, సెప్టెంబర్ 18: మల్కాజ్గిరి నియోజకవర్గంలోని వినాయక్ నగర్, చంద్రగిరి కాలనీల్లో ప్రతిపాదించిన రైల్వే అండర్ బ్రిడ్జి (RUB) నిర్మాణాలపై మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి రైల్వే, MMC ప్రాజెక్టు అధికారులతో కలిసి శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
వినాయక్ నగర్లో ప్రతిపాదించిన 90 అడుగుల వెడల్పు RUB నిర్మాణంతో పెద్ద సంఖ్యలో ఇళ్లకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. స్థానికుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ప్రత్యామ్నాయంగా 60 అడుగుల వెడల్పుతో RUB నిర్మించే అవకాశాన్ని పరిశీలించాలని అధికారులను కోరారు. స్థానికులు అంగీకరిస్తే 60 అడుగుల RUB నిర్మాణానికి పూర్తి సహకారం అందిస్తానని తెలిపారు.
అయితే స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తే తన ఎమ్మెల్యే పదవీకాలంలో 90 అడుగుల వెడల్పుతో RUB నిర్మాణం జరగకుండా చూస్తానని స్పష్టం చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా, ఆస్తులకు సాధ్యమైనంత తక్కువ నష్టం జరిగేలా పరిష్కారం కనుగొనడమే లక్ష్యమని తెలిపారు.
చంద్రగిరి కాలనీ మీదుగా ప్రతిపాదించిన RUBపైనా ఎమ్మెల్యే అధికారులతో చర్చించారు. ఈ మార్గంలో RUB నిర్మిస్తే బస్సుల రాకపోకలకు ఫీజిబిలిటీ ఉండదని, స్థానిక ప్రజలు కూడా నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని చంద్రగిరి కాలనీలో ప్రతిపాదించిన RUBను విరమించుకోవాలని రైల్వే అధికారులను కోరారు.
ప్రజల ప్రయోజనాలకు విరుద్ధంగా ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా స్థానికుల అభిప్రాయాలు, రవాణా సౌకర్యం, భవనాలకు కలిగే నష్టం తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని ఎమ్మెల్యే అధికారులను కోరారు.
ఈ కార్యక్రమంలో రైల్వే డిప్యూటీ సీఈ మల్లికార్జున్, ఎస్ఎస్ఈ వేణు, MMC ప్రాజెక్టు అధికారులు సీఈ శ్రీనివాస్, ఈఈ రోహిణి, డీఈ రేణుక, ఏఈ సుజిత్, బీఆర్ఎస్ నాయకులు బద్ధం పరశురాం రెడ్డి, తులసి సురేష్, ఫరీద్, విజయ్ రెడ్డి, ఎం.ఆర్. శ్రీనివాస్, బాలకృష్ణ, సాయి, స్థానిక కాలనీల వాసులు తదితరులు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


