చిట్వేలు, సెప్టెంబర్ 28: చిట్వేలు మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన రైతు పోలి నారాయణరెడ్డి పొలంలో గుర్తుతెలియని వ్యక్తులు విద్యుత్ కేబుల్ వైర్లను కత్తిరించి అపహరించారు. ఆదివారం రాత్రి 11 గంటల తర్వాత రెండు బోర్ల వద్ద స్టార్టర్ నుంచి మోటార్ వరకు ఉన్న సుమారు 40 మీటర్ల కేబుల్ వైర్లను ఒక్కొక్కటిగా కత్తిరించుకుని వెళ్లినట్లు రైతు తెలిపారు.
ఇప్పటికే కరువు పరిస్థితులతో పంటలు పండక, పండిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్న సమయంలో ఇలాంటి దొంగతనాలతో మరింత నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ బోర్ల వద్ద వైర్లు దొంగిలిస్తున్న వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
రైతులు అప్రమత్తంగా ఉండాలి: బోర్ల వద్ద స్టార్టర్లు, కేబుల్ వైర్లు, ఇతర విద్యుత్ పరికరాలను భద్రంగా ఉంచుకోవాలని, రాత్రి వేళల్లో అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని రైతులకు సూచించారు. పొలాల వద్ద ఒంటరిగా కాకుండా సమూహాలుగా నిఘా ఉంచుకోవాలని కోరుతున్నారు.


