నాగర్ కర్నూల్, అక్టోబర్ 15 (తొలి కిరణం): నేషనల్ హెల్త్ మిషన్ (NHM) ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి డిమాండ్ చేశారు. నాగర్ కర్నూల్ కలెక్టరేట్ ఎదుట NHM ఉద్యోగులు నిర్వహిస్తున్న ధర్నాలో పాల్గొని ఆయన సంఘీభావం తెలిపారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకూడదని అన్నారు.
ఈ సందర్భంగా మర్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ.. చాయ్ తాగినంత సమయంలోనే ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు ఆ హామీని ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ప్రజారోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న NHM ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల కోసం రోడ్డెక్కి ఆందోళన చేయాల్సిన పరిస్థితి రావడం బాధాకరమన్నారు.
గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు ప్రజలకు వైద్య సేవలు అందించడంలో NHM ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకమని, కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ వారు అందించిన సేవలు మరువలేనివని పేర్కొన్నారు. అలాంటి ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించడం, సకాలంలో వేతనాలు చెల్లించడం, వారి సేవలకు తగిన గుర్తింపు ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు.
NHM ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు ఇవే..
• అర్హులైన ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి.
• సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి.
• ఉద్యోగులకు భద్రత కల్పించాలి.
• బదిలీల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలి.
• ప్రతి నెలా ఐదో తేదీలోపు జీతాలు చెల్లించాలి.
• పెండింగ్ జీతాలు, బకాయిలను వెంటనే విడుదల చేయాలి.
• ఇంక్రిమెంట్లు, లాయల్టీ బోనస్ వంటి ఆర్థిక ప్రయోజనాలు కల్పించాలి.
• మహిళా ఉద్యోగులకు నిబంధనల ప్రకారం ప్రసూతి సెలవులు, ఇతర ప్రయోజనాలు అందించాలి.
• విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించాలి.
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వైద్య, ఆరోగ్య రంగానికి ప్రాధాన్యత ఇచ్చిందని పేర్కొన్న ఆయన, ప్రస్తుతం ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతాయుతంగా స్పందించాలని కోరారు. ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో వెంటనే చర్చలు జరిపి, వారి డిమాండ్లపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
కేవలం హామీలతో కాలయాపన చేయకుండా ఉద్యోగులకు ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధనకు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా అండగా ఉంటుందని, వారి పోరాటానికి మద్దతు కొనసాగిస్తామని మర్రి జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు.
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందాలంటే వైద్య, ఆరోగ్య సిబ్బందికి సకాలంలో వేతనాలు, ఉద్యోగ భద్రత, గౌరవప్రదమైన పని వాతావరణం కల్పించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):




