వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం H-1B వీసాల విషయంలో మరో కీలక ప్రతిపాదన చేసింది. కొత్త H-1B వీసాలపై 1,03,265 డాలర్లు (సుమారు రూ.86 లక్షలు) ఫీజుగా విధించేలా అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే అమెరికాలో ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న విదేశీ నిపుణులు, ముఖ్యంగా భారతీయ ఐటీ నిపుణులపై గణనీయమైన ప్రభావం పడే అవకాశం ఉంది.
ప్రతిపాదిత నిబంధనపై 30 రోజుల పాటు ప్రజల నుంచి అభిప్రాయాలను స్వీకరించనున్నారు. అనంతరం తుది నిబంధనను ఖరారు చేసే అవకాశం ఉంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ ఏడాది చివరి నాటికి కొత్త ఫీజు అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.
భారతీయులపై అధిక ప్రభావం
అమెరికాలో టెక్నాలజీ, ఇంజినీరింగ్, విద్య, పరిశోధన వంటి ప్రత్యేక నైపుణ్యాలు అవసరమైన రంగాల్లో విదేశీ నిపుణులను నియమించుకోవడానికి H-1B వీసా కార్యక్రమాన్ని ఉపయోగిస్తారు. ఏటా 65 వేల సాధారణ వీసాలు, అమెరికాలో ఉన్నత విద్య పూర్తి చేసిన వారికి మరో 20 వేల వీసాలు అందుబాటులో ఉంటాయి.
H-1B వీసాల్లో భారతీయుల వాటా అత్యధికంగా ఉండటంతో కొత్త ఫీజు ప్రతిపాదనపై భారతీయ ఐటీ రంగంలో ఆందోళన వ్యక్తమవుతోంది. భారత టెక్ పరిశ్రమకు చెందిన నాస్కామ్ కూడా H-1B కార్యక్రమం అమెరికాలో నైపుణ్య లోటును భర్తీ చేయడంలో కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొంటూ, ఫీజు పెంపుపై పునరాలోచించాలని కోరింది.
ప్రభుత్వ వాదన
H-1B కార్యక్రమాన్ని కొన్ని కంపెనీలు దుర్వినియోగం చేస్తున్నాయని ట్రంప్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. అమెరికన్ల స్థానంలో తక్కువ వేతనాలకు విదేశీ ఉద్యోగులను నియమించేందుకు ఈ విధానాన్ని ఉపయోగిస్తున్నారని ప్రభుత్వం వాదిస్తోంది. భారీ ఫీజుతో అమెరికన్ ఉద్యోగులను నియమించుకోవడం కంపెనీలకు మరింత ఆకర్షణీయంగా మారుతుందని పేర్కొంటోంది.
అయితే వ్యాపార, టెక్ రంగ సంస్థలు మాత్రం H-1B వీసాలు అమెరికాలో నైపుణ్యం కలిగిన ఉద్యోగుల కొరతను తీర్చేందుకు అవసరమని చెబుతున్నాయి. ప్రతిపాదిత ఫీజుపై ఇప్పటికే న్యాయపరమైన వివాదాలు కొనసాగుతున్న నేపథ్యంలో తుది నిర్ణయం ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


