నాగర్‌కర్నూల్: రైతుల ఆదాయాన్ని పెంచడంతో పాటు వ్యవసాయ ఉత్పాదకతను మెరుగుపరిచేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని క్షేత్రస్థాయికి విస్తరించాలని నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు. రైతులకు శాస్త్రీయ సాగు పద్ధతులు, నూతన వ్యవసాయ సాంకేతికతలను చేరువ చేయడంలో పాలెం కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) కీలక పాత్ర పోషించాలని సూచించారు.
శనివారం బిజినపల్లి మండలం పాలెంలోని కేవీకేను కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా రైతులకు అందిస్తున్న శిక్షణలు, సాంకేతిక సేవలు, క్షేత్ర ప్రదర్శనలు, ఇన్స్ట్రక్షనల్ ఫారంలో ఏర్పాటు చేసిన వివిధ యూనిట్లను పరిశీలించారు. విత్తన శుద్ధి, షేడ్‌నెట్ నర్సరీ, వర్మీకంపోస్ట్, పందిరి కూరగాయలు, డ్రాగన్ ఫ్రూట్ తదితర యూనిట్లను పరిశీలించి వాటికి సంబంధించిన పెట్టుబడి, దిగుబడి, మార్కెట్ అవకాశాలు, రైతులకు వచ్చే ఆదాయంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు సంప్రదాయ పంటలకే పరిమితం కాకుండా మార్కెట్ డిమాండ్, నేల స్వభావం, నీటి లభ్యతకు అనుగుణంగా పంటల వైవిధ్యీకరణ చేపట్టేలా ప్రోత్సహించాలని అన్నారు. తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం పొందే పంటలు, ఆధునిక సాగు విధానాలపై రైతులకు నిరంతరం అవగాహన కల్పించాలని సూచించారు.
వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగం రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో రైతులకు వాటి వినియోగం, ప్రయోజనాలపై క్షేత్రస్థాయిలో ప్రాక్టికల్ శిక్షణ అందించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పురుగుమందులు, ఎరువుల వినియోగాన్ని శాస్త్రీయంగా చేపట్టేందుకు డ్రోన్ సాంకేతికతను రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.
అలాగే నాణ్యమైన విత్తనోత్పత్తిని ప్రోత్సహించి రైతులకు అదనపు ఆదాయ మార్గంగా అభివృద్ధి చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. కేవీకే రైతులకు కేవలం శిక్షణ కేంద్రంగా కాకుండా, ఆధునిక వ్యవసాయ సాంకేతికతకు సాంకేతిక వారధిగా పనిచేయాలని సూచించారు
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


