పులివెందుల: పులివెందుల నియోజకవర్గం, పరిసర ప్రాంతాల ప్రజలకు తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా మెగా వాటర్ గ్రిడ్ పథకం పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్ ప్రత్యేక చొరవతో గతంలో నిర్లక్ష్యానికి గురైన తాగునీటి పథకంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.
జల్ జీవన్ మిషన్, అమరజీవి జలధార పథకాల కింద సుమారు రూ.280 కోట్ల నిధులను కేటాయించి తాగునీటి మౌలిక వసతుల అభివృద్ధికి చర్యలు చేపట్టారు. ప్రస్తుతం మొత్తం ప్రాజెక్టు పనులు 96 శాతం పూర్తికాగా, పైప్లైన్ నిర్మాణ పనులు 99 శాతం పూర్తయ్యాయి.
ప్రాజెక్టులో కీలకమైన నీటి శుద్ధి ప్లాంట్ పనులు తుది దశకు చేరుకున్నాయి. పులివెందుల పట్టణం, గ్రామీణ ప్రాంతం, సింహాద్రిపురం మండల పరిధిలో పనులు ఇప్పటికే 100 శాతం పూర్తయ్యాయి. అలాగే లింగాల మండల పరిధిలోని 24 ఆవాసాలకు తాగునీటి సరఫరా అందించేలా పనులు చేపడుతున్నారు.
పథకం పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే పులివెందుల నియోజకవర్గంలోని ప్రజలకు సురక్షితమైన, నిరంతర తాగునీటి సరఫరా అందే అవకాశం ఉంది. మిగిలిన పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు తాగునీటి సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు చర్యలు చేపడుతున్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


