తొలి కిరణం న్యూస్ నాగర్ కర్నూల్, : వచ్చే వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమానికి కేటాయించిన నిధులు ఎంత మేరకు మంజూరు చేసి, ఎంత ఖర్చు చేశారో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని బహుజన్ ముక్తి పార్టీ (బీఎంపీ) పార్లమెంట్ ఇన్చార్జ్ గడ్డం విజయ్ డిమాండ్ చేశారు. నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని సింగిల్ విండో హాల్లో బహుజన్ ముక్తి పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి ఆర్థిక సంవత్సరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమం కోసం అసెంబ్లీలో నిధులు కేటాయిస్తున్నప్పటికీ, కేటాయించిన నిధుల్లో సగం కూడా పూర్తిస్థాయిలో మంజూరు చేసి ఖర్చు చేయడం లేదని ఆరోపించారు. మిగిలిన నిధులను ఇతర ప్రాజెక్టులు, పథకాలకు దారి మళ్లిస్తూ దళిత, బహుజనుల నిధులకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కలిపి గత 12 సంవత్సరాల కాలంలో సుమారు రూ.2 లక్షల కోట్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ నిధులను దారి మళ్లించారని ఆయన ఆరోపించారు. ఈ విషయంపై రాబోయే వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు గళం విప్పి చర్చ జరపాలని కోరారు. అలాగే బహుజనుల సంక్షేమానికి మరిన్ని నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ లక్ష్య సాధనలో భాగంగా ఆగస్టు 23న నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో బహుజన్ ముక్తి పార్టీ ఆధ్వర్యంలో “ఎస్సీ, ఎస్టీ, బీసీల రణభేరి” సభ నిర్వహించనున్నట్లు గడ్డం విజయ్ తెలిపారు. బహుజన వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సోషలిస్టు ఫోరం రాష్ట్ర నాయకులు జిలకర బాలస్వామి, బీఆర్ఎస్పీ పార్లమెంట్ ఇన్చార్జ్ నరిగె నరేందర్, భారత్ ముక్తి మోర్చా జిల్లా నాయకులు కర్నె లక్ష్మయ్య, మందడి వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

