వనస్థలిపురం, నవంబర్ 27 (తొలి కిరణం ప్రతినిధి సురేందర్ రెడ్డి):
ఇంటి తాళం పగులగొట్టి భారీ మొత్తంలో బంగారు ఆభరణాలను అపహరించిన కేసును వనస్థలిపురం పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడితో పాటు చోరీ చేసిన బంగారాన్ని కొనుగోలు చేసిన మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి సుమారు రూ.40 లక్షల విలువైన 360 గ్రాముల (36 తులాల) బంగారు ఆభరణాలతో పాటు రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
చోరీ జరిగిన తీరు..
వనస్థలిపురం కమలానగర్‌కు చెందిన రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి మండలిక సాయి సత్యనారాయణ మూర్తి ఈ నెల 22వ తేదీ రాత్రి 10 గంటలకు ఇంటికి తాళం వేసి గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో ఉన్న తన భార్య వద్దకు వెళ్లారు. మరుసటి రోజు ఉదయం 6 గంటలకు ఇంటికి తిరిగి వచ్చి చూడగా ప్రధాన ద్వారం తాళం పగులగొట్టి ఉండటాన్ని గుర్తించారు. ఇంట్లోని సుమారు 360 గ్రాముల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పాత నేరస్తుడే ప్రధాన నిందితుడు..
కేసు నమోదు చేసుకున్న వనస్థలిపురం పోలీసులు దర్యాప్తు చేపట్టి ఘట్కేసర్ మండలం నారపల్లికి చెందిన బత్తుల రవీందర్ (30)ను ప్రధాన నిందితుడిగా గుర్తించి అరెస్ట్ చేశారు. ఇతనిపై గతంలో 25కు పైగా దొంగతనం కేసులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ముందుగా రెక్కీ నిర్వహించి కమలానగర్‌లోని ఇంట్లో చోరీకి పాల్పడినట్లు విచారణలో వెల్లడైందని తెలిపారు.
చోరీ సొత్తు కొనుగోలుదారుడి అరెస్ట్..
దొంగిలించిన బంగారాన్ని విక్రయించేందుకు ఆదిభట్ల రాగన్నగూడకు చెందిన క్యాబ్ డ్రైవర్ నేనావత్ కృష్ణ (28)కు ఇచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. దీంతో పోలీసులు అతడిని కూడా అరెస్ట్ చేశారు.
36 తులాల బంగారం రికవరీ..
నిందితుల నుంచి నెక్లెస్‌లు, గాజులు, పుస్తెలతాడు, ముత్యాల చైన్, పగడాల చైన్, నల్లపూసల గొలుసులు, చెవిదిద్దులు, ఉంగరం, కరిగించిన బంగారు ముక్కలు తదితర మొత్తం 360 గ్రాముల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.40 లక్షలుగా అంచనా వేశారు. అదనంగా రెండు సెల్ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు.
నేరాల నియంత్రణలో భాగంగా పోలీసులు ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని, ఇళ్లకు తాళం వేసి దూరప్రాంతాలకు వెళ్లే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


