తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గురువారం నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా పదర మండలం మద్దిమడుగులోని ప్రసిద్ధ శ్రీ పబ్బతి ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ముఖ్యమంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఆశీర్వచనాలు అందించారు.
అనంతరం ఆలయ సమీపంలో గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ విగ్రహం, ఆలయ నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి భూమిపూజ నిర్వహించారు. అలాగే శ్రీ పబ్బతి ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధి పనులు, హరిత హోటల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాలతో మద్దిమడుగు ప్రాంతంలో ఆధ్యాత్మిక, పర్యాటక అభివృద్ధికి మరింత ప్రాధాన్యత లభించనుంది.
అనంతరం అచ్చంపేటలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. నాగర్కర్నూల్ జిల్లా పరిధిలో సుమారు రూ.450 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.
భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇందిరమ్మ మహిళా శక్తి పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా కోటి మంది మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో 65 లక్షల మంది, పట్టణ ప్రాంతాల్లో 35 లక్షల మంది మహిళలకు చీరలు అందించనున్నారు. అదేవిధంగా చేయూత పథకం కింద కొత్తగా మంజూరైన పింఛన్ల పంపిణీని కూడా ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు, వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గిరిజన సంఘాల ప్రతినిధులు, భక్తులు, ప్రజలు పాల్గొన్నారు.





