తొలికిరణం నవంబర్ 25 ఘట్కేసర్ ప్రతినిధి
మేడ్చల్ జిల్లా, ఘట్కేసర్ సర్కిల్, 7వ డివిజన్, ఎదులాబాద్ పరిధిలోని పకీర్ టేక్యలో సర్వే నంబర్ 1107 ప్రభుత్వ భూమిలో ఎలాంటి అనుమతులు లేకుండానే ఇంటి నిర్మాణం చేపడుతున్నారనే ఆరోపణలు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అంతటితో ఆగకుండా ప్రభుత్వ నిధులతో నిర్మించిన సీసీ రోడ్డును సైతం అనుమతులు లేకుండా పగలగొట్టి, ఎలాంటి రుసుములు చెల్లించకుండానే ప్రభుత్వ మంచినీటి కనెక్షన్ తీసుకున్నారనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంపై స్థానికులు సంబంధిత అధికారులను ప్రశ్నించగా, తమకు తెలియకుండానే నిర్మాణ పనులు జరుగుతున్నాయని, అధికారులను క్షేత్రస్థాయికి పంపించి పనులను నిలిపివేశామని అధికారులు వివరణ ఇచ్చినట్లు స్థానికులు వెల్లడిస్తున్నారు. అయితే అధికారుల వివరణ ఇచ్చిన తర్వాత సుమారు 15 రోజుల పాటు నిలిచిన నిర్మాణ పనులు, తిరిగి ప్రారంభం కావడం ఇప్పుడు పలు అనుమానాలకు తావిస్తోంది. అధికారుల దృష్టికి తీసుకెళ్లి పనులు నిలిపివేయించినప్పటికీ, మళ్లీ పనులు ఎలా ప్రారంభమయ్యాయి..? పనులు నిలిపివేసిన అధికారులు ఆ తర్వాత పర్యవేక్షణ ఎందుకు చేయలేదు..? అధికారుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ నిర్మాణం కొనసాగించడానికి కారణాలేమిటి..? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. తిరిగి పనులు ప్రారంభమైన విషయాన్ని గమనించిన స్థానికులు ఈ వ్యవహారాన్ని పత్రికా విలేకరుల దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ప్రభుత్వ భూమిలో జరుగుతున్న నిర్మాణాలపై మరోసారి చర్చ మొదలైంది. అధికారులు పనులు నిలిపివేశామని చెబుతున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం మళ్లీ పనులు కొనసాగుతుండటం అధికారుల పర్యవేక్షణ తీరుపై ప్రశ్నలు రేకెత్తిస్తోంది. ఒకవైపు ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురవుతున్నాయనే ఆరోపణలు, మరోవైపు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తూ, ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి కొడుతున్నారనే ఫిర్యాదులు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంలో రెవెన్యూ, మున్సిపల్, మంచినీటి సరఫరా విభాగాల అధికారుల పర్యవేక్షణ ఎక్కడుందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అధికారులకు తెలియదా..? తెలిసినా పట్టించుకోవడం లేదా..? ప్రభుత్వ భూమిలో నిర్మాణాలు జరుగుతున్నా సంబంధిత రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారా..? సీసీ రోడ్డును ఎవరి అనుమతితో ధ్వంసం చేశారు..? ప్రభుత్వ మంచినీటి కనెక్షన్ ఏ ప్రాతిపదికన మంజూరు చేశారు..? కనెక్షన్ కోసం నిర్ణీత రుసుములు చెల్లించారా..? సంబంధిత శాఖల రికార్డుల్లో ఈ వ్యవహారానికి సంబంధించిన వివరాలు ఉన్నాయా..? అన్న ప్రశ్నలకు అధికారులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ వ్యవహారంలో అధికారుల పాత్రపై స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అధికారుల ప్రమేయం ఉందా..? లేక సంబంధిత సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందా..? అన్న అంశాలపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలికితీయాలని ప్రజలు కోరుతున్నారు. జిల్లా కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్, సంబంధిత మంచినీటి సరఫరా శాఖ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి పకీర్ టేక్యలోని సర్వే నంబర్ 1107 ప్రభుత్వ భూమిని క్షేత్రస్థాయిలో పరిశీలించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ భూమి హద్దులను నిర్ధారించి, అనుమతులు లేకుండా నిర్మాణం చేపట్టినట్లు తేలితే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అంతేకాకుండా ధ్వంసమైన సీసీ రోడ్డును సంబంధిత బాధ్యులతోనే పునరుద్ధరించాలని, ప్రభుత్వ మంచినీటి కనెక్షన్‌కు సంబంధించిన అనుమతులు, రుసుముల చెల్లింపులపై సమగ్ర విచారణ జరపాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పనులు నిలిపివేసిన తర్వాత తిరిగి నిర్మాణం ప్రారంభం కావడానికి గల కారణాలను కూడా అధికారులు తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ భూములు ప్రైవేటు వ్యక్తుల సొంత ఆస్తులుగా మారకుండా కాపాడాల్సిన బాధ్యత అధికారులదే. ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలిగించే చర్యలను ఉపేక్షిస్తే ప్రజాధనానికి రక్షణ కల్పించేది ఎవరు..? ఇప్పటికైనా ఉన్నతాధికారులు కళ్లుతెరిచి, ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజల డిమాండ్.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


