అతినారపు కిరణ్ కుమార్ (తొలికిరణం ప్రతినిధి)
అచ్చంపేట, నవంబర్ 23*: ఈ నెల 26న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అచ్చంపేట పట్టణ పర్యటన నేపథ్యంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్, జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అచ్చంపేట సబ్ కలెక్టర్ సలోని చాబ్రాతో కలిసి సభా ప్రాంగణం, హెలిప్యాడ్, ముఖ్యమంత్రి పాదయాత్ర మార్గం, అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించే ప్రాంతాన్ని సందర్శించి ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు.
అచ్చంపేట పట్టణంలోని వై జంక్షన్ వద్ద ఏర్పాటు చేయనున్న ముఖ్యమంత్రి బహిరంగ సభా ప్రాంగణాన్ని పరిశీలించిన కలెక్టర్, అక్కడ జరుగుతున్న పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. సభకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్నందున వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. సభా వేదిక, ప్రజలు కూర్చునే ప్రదేశం, ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, తాగునీటి సౌకర్యం, పారిశుద్ధ్య నిర్వహణ తదితర అంశాలను సమీక్షించారు.
ముఖ్యమంత్రి పర్యటన దృష్ట్యా భద్రతా ఏర్పాట్లలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. సభకు వచ్చే ప్రజల వాహనాల పార్కింగ్‌కు ప్రత్యేక స్థలాలు కేటాయించడంతో పాటు, వీఐపీల వాహనాలకు ప్రత్యేక పార్కింగ్ సదుపాయం కల్పించాలని తెలిపారు. పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించాలని, సభా ప్రాంగణానికి ప్రజలు సులభంగా చేరుకునేలా మార్గదర్శకాలు, సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
అనంతరం లింగాల రోడ్డులోని ఆర్టీసీ గ్రౌండ్‌ను సందర్శించి ముఖ్యమంత్రి హెలికాప్టర్ దిగేందుకు ఏర్పాటు చేయనున్న హెలిప్యాడ్ స్థలాన్ని పరిశీలించారు. హెలిప్యాడ్‌కు అవసరమైన స్థలాన్ని సిద్ధం చేయడం, పరిసర ప్రాంతాల్లో భద్రతా చర్యలు, ముందస్తు పర్యవేక్షణ తదితర అంశాలపై అధికారులకు సూచనలు చేశారు. హెలికాప్టర్ ల్యాండింగ్, ముఖ్యమంత్రి రాకపోకలకు సంబంధించి అన్ని ఏర్పాట్లను నిబంధనల ప్రకారం పూర్తి చేయాలని తెలిపారు.
హెలిప్యాడ్ నుంచి ముఖ్యమంత్రి పాదయాత్రగా సభా ప్రాంగణానికి చేరుకోనున్న నేపథ్యంలో ఆ మార్గాన్ని కూడా అధికారులు పరిశీలించారు. పాదయాత్ర మార్గంలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని, ప్రజల రాకపోకలకు అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి ప్రయాణించే మార్గంలో బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల భద్రతకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై ఎస్పీతో సమీక్షించారు.
అలాగే అచ్చంపేట పట్టణంలోని అంబేద్కర్ కూడలిని సందర్శించి ముఖ్యమంత్రి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించనున్న ప్రదేశాన్ని పరిశీలించారు. విగ్రహం వద్ద పూలమాల సమర్పణకు అనువైన స్థలం, పరిసరాల పరిశుభ్రత, భద్రతా ఏర్పాట్లు, ముఖ్యమంత్రి రాకపోకలకు అనుగుణంగా చేపట్టాల్సిన ముందస్తు చర్యలపై అధికారులతో చర్చించారు. ఈ కార్యక్రమం ఎలాంటి ఆటంకాలు లేకుండా సజావుగా జరిగేలా ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి ప్రతి అంశాన్ని అధికారులు ప్రత్యేక బాధ్యతతో పర్యవేక్షించాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ ముందస్తు ప్రణాళిక ప్రకారం ఏర్పాట్లను పూర్తి చేయాలని, ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేపట్టాలని స్పష్టం చేశారు. సభకు హాజరయ్యే ప్రజలు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని తెలిపారు.
ఈ పరిశీలనలో అదనపు కలెక్టర్ దేవ సహాయం, అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు, అచ్చంపేట డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ నాగరాజ్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):



