నాగర్‌కర్నూల్ జిల్లా: కొల్లాపూర్ మండలం రామాపురం గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న విద్యార్థి పవన్‌కుమార్‌పై ఉపాధ్యాయుడు సతీష్ దాడి చేసిన ఘటనపై విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ ఘటనకు బాధ్యుడైన ఉపాధ్యాయుడిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అడిషనల్ కలెక్టర్‌కు ఫిర్యాదు అందజేశారు.
బంజారా గిరిజన విద్యార్థి సమైక్య రాష్ట్ర అధ్యక్షులు శివ నాయక్, తెలంగాణ విద్యార్థి పరిషత్ (TGVP) ఉమ్మడి మహబూబ్‌నగర్ ఇన్చార్జ్ రవి యాదవ్ ఆధ్వర్యంలో అడిషనల్ కలెక్టర్‌ను కలిసి ఫిర్యాదు సమర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పాఠశాలలు విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి, వారిలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంపొందించాల్సిన కేంద్రాలని, అలాంటి పాఠశాలలో చిన్నారిపై ఉపాధ్యాయుడు దాడి చేయడం అత్యంత బాధాకరమని అన్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులను ప్రేమతో, ఓర్పుతో ప్రోత్సహించాల్సిన ఉపాధ్యాయులు దాడులకు పాల్పడటం సరైన విధానం కాదని పేర్కొన్నారు.
విద్యార్థి పవన్‌కుమార్‌పై దాడికి పాల్పడిన ఉపాధ్యాయుడు సతీష్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలని, ఘటనకు సంబంధించిన వాస్తవాలను వెలికితీసి సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కొల్లాపూర్ మండల విద్యాశాఖ అధికారి (MEO) పాత్రపై కూడా విచారణ జరిపి, నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇంత తీవ్రమైన ఘటన చోటుచేసుకున్నప్పటికీ జిల్లా విద్యాశాఖ అధికారి (DEO) స్థాయిలో సరైన పర్యవేక్షణ లేకపోవడం, తగిన విధంగా స్పందించకపోవడం విద్యాశాఖ నిర్లక్ష్యానికి నిదర్శనమని విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా విద్యాశాఖ అధికారి వెంటనే స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పాఠశాలల్లో పర్యవేక్షణను కట్టుదిట్టం చేయాలని కోరారు.
విద్యార్థి భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, చిన్నారులపై దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు స్పష్టం చేశారు.
విద్యార్థి సంఘాల ఫిర్యాదుపై స్పందించిన అడిషనల్ కలెక్టర్ ఘటనపై సమగ్ర విచారణ జరిపించి, విచారణలో వెల్లడయ్యే అంశాల ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో బంజారా గిరిజన విద్యార్థి సమైక్య రాష్ట్ర అధ్యక్షులు శివ నాయక్, తెలంగాణ విద్యార్థి పరిషత్ ఉమ్మడి మహబూబ్‌నగర్ ఇన్చార్జ్ రవి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):





