చరిత్రలో చెరగని వీరనారి ముద్ర..
1828 నవంబర్ 19న జన్మించిన మణికర్ణిక (మను) అనంతరం ఝాన్సీ రాణి లక్ష్మీబాయిగా ప్రసిద్ధి చెందారు. చిన్ననాటి నుంచే గుర్రపు స్వారీ, కత్తిసాము, విలువిద్య వంటి యుద్ధ విద్యల్లో శిక్షణ పొందారు. ఝాన్సీ మహారాజు గంగాధర్ రావును వివాహం చేసుకున్న అనంతరం ఝాన్సీ రాణిగా బాధ్యతలు చేపట్టారు. 1857లో ప్రారంభమైన ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడారు.
బ్రిటిష్ ప్రభుత్వం ఝాన్సీ రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నించినప్పుడు ఆమె ఏమాత్రం వెనుకడుగు వేయకుండా తన రాజ్యాన్ని, ప్రజలను కాపాడేందుకు యుద్ధరంగంలోకి దిగారు. సైన్యాన్ని సమీకరించి బ్రిటిష్ సైన్యంతో వీరోచితంగా పోరాడారు. గుర్రంపై స్వారీ చేస్తూ చేతిలో కత్తి పట్టుకొని శత్రువులను ఎదుర్కొన్న ఆమె సాహసం భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది.
1858 జూన్ 18న గ్వాలియర్ సమీపంలో జరిగిన యుద్ధంలో వీరమరణం పొందారు. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన ఆమె త్యాగం తరతరాలకు స్ఫూర్తిదాయకం. మహిళలు అన్ని రంగాల్లో ధైర్యంగా ముందుకు సాగేందుకు ఆమె జీవితం గొప్ప ఆదర్శంగా నిలుస్తోంది.
వీరనారి లక్ష్మీబాయి కేవలం ఒక రాజ్యానికి రాణి మాత్రమే కాదు.. భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రలో ధైర్యానికి, ఆత్మగౌరవానికి, దేశభక్తికి ప్రతీకగా నిలిచిన మహావీరనారి. ఆమె ఆశయాలు, పోరాట స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని ఈ సందర్భంగా పలువురు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో యూ. ఆంజనేయులు, ఆనంద్ సింగ్, వంశీ, పూసల బాలరాజు, సిద్ధార్థ, శివరామ్, భగవంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.




