అచ్చంపేట / అమ్రాబాద్ (తొలి కిరణం):
నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం వట్టెవర్లపల్లి గ్రామంలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు అనేక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బంజారా గిరిజన విద్యార్థి సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు శివ నాయక్ ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాలలో నెలకొన్న సమస్యలను విద్యార్థులతో కలిసి తెలుసుకున్న ఆయన, సంబంధిత అధికారుల నిర్లక్ష్యంపై ప్రశ్నించారు.
ఉపాధ్యాయుల కొరతతో విద్యార్థులకు నష్టం!
పాఠశాలలో ఇంగ్లీష్, గణితం, బయాలజీ వంటి కీలక సబ్జెక్టులకు ఉపాధ్యాయులు లేకపోవడంతో విద్యార్థులు చదువులో వెనుకబడే ప్రమాదం ఉందని శివ నాయక్ పేర్కొన్నారు. ముఖ్యంగా పదో తరగతి విద్యార్థులకు విద్యా సంవత్సరం గడుస్తున్నా పూర్తిస్థాయిలో బోధన అందకపోవడం ఆందోళనకరమన్నారు. ఉపాధ్యాయుల కొరతను వెంటనే పరిష్కరించి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని డిమాండ్ చేశారు.
కుళ్లిన అరటిపండ్ల పంపిణీ.. పెరుగు బంద్!
ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాల్సి ఉండగా, కుళ్లిన అరటిపండ్లు పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. అంతేకాకుండా నెల రోజులుగా విద్యార్థులకు పెరుగు అందించడం లేదని, ఉదయం అల్పాహారం కూడా నిలిపివేశారని పేర్కొన్నారు. విద్యార్థుల ఆరోగ్యంతో చెలగాటమాడకుండా ఆహార నాణ్యతపై అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని కోరారు.
బాత్రూంలు లేక అడవి బాట.. ఫ్యాన్లు లేని తరగతి గదులు!
పాఠశాలలో సరైన మరుగుదొడ్ల సౌకర్యాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కనీస వసతులు కూడా కల్పించకపోవడం బాధాకరమన్నారు. తరగతి గదుల్లో ఫ్యాన్లు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారని తెలిపారు. తరగతి గదుల్లో సిగరెట్ డబ్బాలు కనిపించడం పాఠశాల నిర్వహణపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతోందన్నారు.
అధికారులు తక్షణమే స్పందించాలి!
పాఠశాలలో నెలకొన్న సమస్యలపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని శివ నాయక్ డిమాండ్ చేశారు. విద్యార్థులకు అవసరమైన ఉపాధ్యాయులను నియమించడంతో పాటు, నాణ్యమైన భోజనం, మరుగుదొడ్లు, ఫ్యాన్లు వంటి కనీస సౌకర్యాలు కల్పించాలని కోరారు. ప్రిన్సిపల్ లింగయ్యపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపి బాధ్యత నిర్ధారించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గిరిజన విద్యార్థుల భవిష్యత్తుతో అధికారులు చెలగాటమాడకుండా తక్షణమే సమస్యలను పరిష్కరించాలని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో టీజీవీపీ నాయకుడు రవి యాదవ్, ఆంగోత్ శివ నాయక్, స్వామి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):







