పాలెం: బిజినపల్లి మండలంలోని పాలెం గ్రామంలో ప్రతి ఆదివారం నిర్వహించే కూరగాయల సంతను ప్రస్తుత స్థలం నుంచి కాలేజ్ రోడ్డుకు తరలించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
గ్రామంలోని అంబేద్కర్ చౌరస్తా నుంచి గాంధీ బొమ్మ చౌరస్తా వరకు సుమారు 200 మీటర్ల మేర ప్రధాన రహదారిపై సంత నిర్వహిస్తుండటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు సంతకు వచ్చే ప్రజలు, కొనుగోలుదారులు, వాహనాలతో రహదారి కిక్కిరిసిపోతోందని చెబుతున్నారు.
పాలెం గ్రామంతో పాటు గుడ్లనర్వ, కారుకొండ, కొట్టాలగడ్డ, వెంకటాపురం, ఖానాపూర్ తదితర చుట్టుపక్కల గ్రామాల ప్రజలు నిత్యావసర సరుకులు, కూరగాయల కొనుగోలు కోసం ఈ సంతకు వస్తుంటారు. దీంతో ప్రతి ఆదివారం రహదారిపై భారీ రద్దీ నెలకొంటోంది. గతంలో ఈ రహదారిపై పలువురు ప్రమాదాలకు గురైన సందర్భాలు కూడా ఉన్నాయని గ్రామస్థులు గుర్తుచేస్తున్నారు.
మరోవైపు రహదారిపై వెళ్లే వాహనాల నుంచి వెలువడే పొగ, దుమ్ము, ధూళి కూరగాయలపై పడటంతో ఆహార పదార్థాల నాణ్యత దెబ్బతింటోందని, ప్రజల ఆరోగ్యానికి కూడా ముప్పు వాటిల్లే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ సమస్యను దృష్టిలో ఉంచుకొని కూరగాయల సంతను కాలేజ్ రోడ్డుకు తరలించాలని గ్రామస్థులు కోరుతున్నారు. ఈ విషయమై బిజినపల్లి మండల తహసీల్దార్ (ఎం.ఆర్.ఓ), గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, గ్రామ కార్యదర్శి దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు తెలిపారు.
ప్రజల భద్రత, వాహనదారుల సౌకర్యం, వ్యాపారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని అధికారులు, ప్రజాప్రతినిధులు తక్షణమే స్పందించి సంతకు ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయించాలని గ్రామ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
– డి. వెంకటయ్య, మాజీ సైనికుడు, పాలెం గ్రామం.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


