తొలికిరణం, నవంబర్ 05, ఘట్కేసర్ ప్రతినిధి:
దీపావళి పండుగను పురస్కరించుకుని ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శాశ్వత, తాత్కాలిక బాణసంచా దుకాణాలను ఘట్కేసర్ ఎస్హెచ్ఓ తన బృందంతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దుకాణాల్లో ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లు, బాణసంచా నిల్వలు, అగ్నిమాపక రక్షణ పరికరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
అనంతరం దుకాణదారులకు పలు కీలక సూచనలు చేస్తూ భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. పోలీసు, అగ్నిమాపక శాఖల నుంచి సరైన అనుమతులు పొందిన వారు మాత్రమే బాణసంచా విక్రయాలు చేపట్టాలని స్పష్టం చేశారు. ప్రతి దుకాణం వద్ద అగ్నిమాపక యంత్రాలు, నీటి బకెట్లు, ఇసుక బకెట్లను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.
దుకాణాల మధ్య తగినంత ఖాళీ స్థలం ఉండేలా చూసుకోవాలని, విద్యుత్ వైరింగ్ పటిష్టంగా ఉండాలని తెలిపారు. దుకాణాల పరిసరాల్లో ధూమపానం, బహిరంగ మంటలు వెలిగించడం పూర్తిగా నిషేధమని హెచ్చరించారు. అనుమతించిన పరిమితికి మించి బాణసంచా నిల్వ చేయరాదని స్పష్టం చేశారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
ఈ సందర్భంగా ఎస్హెచ్ఓ మాట్లాడుతూ.. భద్రతా ప్రమాణాలు పాటించకుండా అక్రమంగా బాణసంచా విక్రయాలు జరిపే దుకాణాలను సీజ్ చేయడంతో పాటు, బాధ్యులపై కఠిన క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రజల ప్రాణ, ఆస్తుల రక్షణే పోలీసుల ప్రథమ కర్తవ్యమని పేర్కొన్నారు. ప్రజలు కూడా లైసెన్స్ పొందిన దుకాణాల్లోనే బాణసంచా కొనుగోలు చేసి, తగిన జాగ్రత్తలు పాటిస్తూ సురక్షితంగా పండుగ జరుపుకోవాలని ఘట్కేసర్ పోలీసులు సూచించారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


