పాలెం, నవంబర్ 03: తొలి కిరణం న్యూస్:
ప్రస్తుతం ఎల్నినో ప్రభావం, వాతావరణ మార్పుల నేపథ్యంలో రైతులు వరి పంటపై మాత్రమే ఆధారపడకుండా తక్కువ నీటి అవసరం కలిగిన ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే), పాలెం శాస్త్రవేత్తలు సూచించారు. మినుములు, వేరుశెనగ, ఆముదం వంటి పంటలను సాగు చేయడం ద్వారా నీటి వనరులను సమర్థంగా వినియోగించుకోవడంతో పాటు వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చుకోవచ్చని తెలిపారు.
‘రైతు పొలాల్లోకి ఆవిష్కరణలు’ కార్యక్రమంలో భాగంగా రైతులకు క్షేత్రస్థాయిలో శాస్త్రీయ పరిజ్ఞానాన్ని అందించారు. వ్యవసాయ పరిశోధనల్లో సాధించిన ఫలితాలను నేరుగా రైతుల పొలాలకు చేరవేయడం, ఆధునిక సాగు పద్ధతులపై అవగాహన కల్పించడం, పంటల ఉత్పాదకతను పెంచడం, రైతుల ఆదాయాన్ని మెరుగుపరచడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశ్యమని వివరించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా మినుముల పంటలో అధిక దిగుబడులు సాధించేందుకు అనుసరించాల్సిన శాస్త్రీయ సాగు పద్ధతులపై రైతులకు ప్రత్యేకంగా వివరించారు. ముఖ్యంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం (PJTAU) ద్వారా విడుదలైన MBG-1070 మినుముల రకం ప్రత్యేక లక్షణాలు, అధిక దిగుబడి సామర్థ్యం, తెగుళ్లను తట్టుకునే లక్షణాలు, సాగు సమయంలో పాటించాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి అవగాహన కల్పించారు.
వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల ఎంపిక చేసుకోవడం, అందుబాటులో ఉన్న నీటి వనరులను పొదుపుగా వినియోగించుకోవడం, శాస్త్రీయ పద్ధతుల్లో సాగు చేపట్టడం ద్వారా పంట నష్టాలను తగ్గించుకోవచ్చని శాస్త్రవేత్తలు సూచించారు. రైతులు ఆధునిక వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని వ్యవసాయాన్ని మరింత స్థిరమైన, లాభదాయకమైన వృత్తిగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు.
శాస్త్రవేత్తలు రైతులకు నిరంతరం అందుబాటులో ఉంటూ పరిశోధన ఫలితాలను నేరుగా క్షేత్రస్థాయికి తీసుకెళ్లడం ద్వారా వ్యవసాయ రంగంలో మెరుగైన ఫలితాలు సాధించవచ్చని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ ఓ. శైల, డాక్టర్ చిరంజీవి, డాక్టర్ జి. ఈశ్వరారెడ్డి, డాక్టర్ వి. దివ్యారాణి మరియు పలువురు రైతులు పాల్గొన్నారు.
శాస్త్రీయ పరిజ్ఞానం రైతుల ముంగిటకు.. ప్రత్యామ్నాయ పంటలతో అధిక ఆదాయానికి బాటలు! అనే లక్ష్యంతో కృషి విజ్ఞాన కేంద్రం, పాలెం ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


