అతినారపు కిరణ్ కుమార్ (తొలి కిరణం ప్రతినిధి)
తెలకపల్లి: నాగర్కర్నూల్ జిల్లా తెలకపల్లి మండల పరిధిలోని పర్వతాపూర్ గ్రామానికి చెందిన జరుపటి శేఖర్ (28) మృతి చెందాడు. ఈ ఘటనపై తెలకపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శేఖర్ సుమారు ఏడేళ్ల క్రితం రాకొండ గ్రామానికి చెందిన వరలక్ష్మిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. గత కొంతకాలంగా కుటుంబ విషయాలపై భార్యాభర్తల మధ్య విభేదాలు కొనసాగుతున్నట్లు సమాచారం.
నవంబర్ 2న మధ్యాహ్నం సుమారు 2 గంటల సమయంలో తెలకపల్లికి వెళ్లి వస్తానని భార్యకు చెప్పి ఇంటి నుంచి వెళ్లిన శేఖర్ ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో తన అన్న నాగేష్కు ఫోన్ చేసి తనకు జీవించాలనే ఆసక్తి లేదని చెప్పినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అనంతరం తెలకపల్లి శివారులోని ఓ వెంచర్లో చెట్టుకు ఉరివేసుకున్న స్థితిలో శేఖర్ కనిపించాడు.
కుటుంబ కలహాల నేపథ్యంలో మనస్తాపానికి గురై శేఖర్ ఈ ఘటనకు పాల్పడినట్లు అతని భార్య జరుపటి వరలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలకపల్లి ఎస్ఐ ఎం. రమేష్ వెల్లడించారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


