తొలి కిరణం | అక్టోబర్ 30 | ఘట్కేసర్ ప్రతినిధి
హైదరాబాద్‌ను పెట్టుబడులకు అనుకూలమైన నగరంగా మాత్రమే కాకుండా, ప్రజలు మెరుగైన జీవన ప్రమాణాలతో జీవించేందుకు అనువైన ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, వేగవంతమైన పరిపాలన, నిరంతర విద్యుత్ సరఫరా, పర్యావరణహిత అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ సమీపంలోని పోచారం ఇన్ఫోసిస్ క్యాంపస్‌లో విస్తరణలో భాగంగా నిర్మించిన నూతన కార్యాలయ భవనాన్ని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇన్ఫోసిస్ ప్రతినిధులు వారికి ఘన స్వాగతం పలికారు.
అనంతరం సంస్థ కార్యకలాపాలు, అంతర్జాతీయ ప్రస్థానం, పోచారం క్యాంపస్ విస్తరణ, నూతన భవనంలోని ఆధునిక సదుపాయాలపై రూపొందించిన ప్రజెంటేషన్‌ను వీక్షించారు. నూతన కార్యాలయ భవనాన్ని పరిశీలించి అక్కడి సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ హైదరాబాద్‌లో ఇన్ఫోసిస్ మరోసారి భారీ స్థాయిలో విస్తరించడం నగరంపై అంతర్జాతీయ సంస్థలకు ఉన్న నమ్మకానికి నిదర్శనమన్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లో 48 వేల మందికి పైగా ఉద్యోగులతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఇన్ఫోసిస్, తాజాగా పది లక్షల చదరపు అడుగులకు పైగా విస్తీర్ణంలో నూతన కార్యాలయ భవనాన్ని అందుబాటులోకి తీసుకురావడం తెలంగాణ ఐటీ రంగ అభివృద్ధికి మరింత దోహదపడుతుందని పేర్కొన్నారు.
ఐటీ రంగం వేలాది కుటుంబాల ఆర్థిక, సామాజిక అభ్యున్నతికి బాటలు వేస్తోందని, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. ప్రస్తుతం కృత్రిమ మేధస్సు (ఏఐ) వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఐటీ రంగంలో కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయని, వాటిని అందిపుచ్చుకునేలా యువతకు నైపుణ్య శిక్షణతో పాటు ప్రాక్టికల్ అనుభవం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
హైదరాబాద్‌కే పరిమితం కాకుండా తెలంగాణలోని జిల్లాల కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు సైతం ఐటీ రంగంలో సమాన అవకాశాలు కల్పించాలని సూచించారు. పరిశ్రమలు, విద్యాసంస్థల మధ్య భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని ఇన్ఫోసిస్ ప్రతినిధులను కోరారు.
రాష్ట్ర యువతకు మెరుగైన నైపుణ్యాలు, విస్తృత ఉపాధి అవకాశాలు కల్పిస్తూ తెలంగాణను అంతర్జాతీయ ఐటీ, పెట్టుబడుల కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


