నాగర్కర్నూల్, అక్టోబర్ 18 (తొలి కిరణం న్యూస్): నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని రాఘవేంద్ర కాలనీలో శివశక్తి యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దుర్గామాత శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం దుర్గామాత అమ్మవారికి భవాని మాతలు ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించగా, భక్తులు భజనలు, కీర్తనలతో అమ్మవారిని స్మరించుకున్నారు.
ప్రధాన అర్చకులు గవ్వమఠం విజయ్ కుమార్ శాస్త్రి ఆధ్వర్యంలో అమ్మవారికి శాస్త్రోక్తంగా అభిషేక పూజలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. అనంతరం కాలనీలోని మహిళలు దుర్గామాతకు సమర్పించిన ఒడిబియ్యాన్ని భక్తులకు అందజేశారు.
భక్తులకు అన్నప్రసాద పంపిణీ
శివశక్తి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భవాని దీక్షాపరులతో పాటు కాలనీవాసులకు, ఇతర భక్తులకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు. జిల్లా కేంద్రంలోని వివిధ కాలనీలకు చెందిన భవాని దీక్షాపరులు దుర్గామాత సన్నిధిలో ప్రత్యేక భజనలు, కీర్తనలు నిర్వహించి భక్తిని చాటుకున్నారు. అమ్మవారి నామస్మరణతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
అమ్మవారి కృపాకటాక్షాలు విశేషం
ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు గవ్వమఠం విజయ్ కుమార్ శాస్త్రి మాట్లాడుతూ శరన్నవరాత్రుల సమయంలో అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజించే భక్తులకు అమ్మవారి కృపాకటాక్షాలు విశేషంగా ఉంటాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకొని భక్తిమార్గంలో నడవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో శివశక్తి యూత్ అసోసియేషన్ సభ్యులు, కాలనీవాసులు, మహిళలు, చిన్నారులు, భవాని దీక్షాపరులు, ఇతర భక్తులు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


