తొలికిరణం న్యూస్, అక్టోబర్ 14, నాగర్ కర్నూల్ బ్యూరో:
జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, వృత్తిపరమైన భద్రత కోసం తెలంగాణ మాదిగ జర్నలిస్టుల ఫోరం (టీఎంజేఎఫ్) నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బూర్గుల నాగేందర్ మాదిగ స్పష్టం చేశారు. జర్నలిస్టుల గొంతుకను అణిచివేయాలని చూస్తే హక్కుల సాధన కోసం పోరాడే కొత్త తరం మరింత బలంగా ముందుకొస్తుందని హెచ్చరించారు.
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని దేవకి ఫంక్షన్ హాల్లో బుధవారం టీఎంజేఎఫ్ రాష్ట్ర అధికార ప్రతినిధి పంగిడిచెరువు వెంకటేష్ అధ్యక్షతన నిర్వహించిన జిల్లా సమీక్ష సమావేశానికి బూర్గుల నాగేందర్ మాదిగ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టులు ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తున్నారని పేర్కొన్నారు. అలాంటి జర్నలిస్టులకు వృత్తిపరమైన భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు.
జర్నలిస్టుల రక్షణ చట్టాన్ని అమలు చేయాలి
విధి నిర్వహణలో జర్నలిస్టులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దాడులు, బెదిరింపుల నుంచి రక్షణ కల్పించేందుకు సమగ్ర జర్నలిస్టుల రక్షణ చట్టాన్ని ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల రక్షణ చట్టం అమల్లోకి వచ్చే వరకు టీఎంజేఎఫ్ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
ప్రతి జర్నలిస్టుకూ హెల్త్ కార్డులు అందించాలి
అర్హులైన ప్రతి జర్నలిస్టుకు హెల్త్ కార్డులు మంజూరు చేయడంతోపాటు, వారి కుటుంబ సభ్యులకు సైతం మెరుగైన వైద్య సేవలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
టీఎంజేఎఫ్ జిల్లా నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక
సమావేశంలో టీఎంజేఎఫ్ నాగర్ కర్నూల్ జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
జిల్లా అధ్యక్షుడు: వంగూరు జయశంకర్ ఉపాధ్యక్షులు: సౌటా రాములు, ఎర్రవల్లి శ్రీనివాసులు ప్రధాన కార్యదర్శి: డి. రామస్వామి కోశాధికారి: కావలి పరశురాములు ఆర్గనైజింగ్ కార్యదర్శులు: గిద్ద విజయ్ కుమార్, సి. సుందర్
నూతన కమిటీ సభ్యులకు రాష్ట్ర అధ్యక్షుడు బూర్గుల నాగేందర్ మాదిగ అభినందనలు తెలిపారు. జిల్లాలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, అర్హులైన జర్నలిస్టులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో టీఎంజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దుబ్బ నాగేష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొల్లె రాజన్న, జంగయ్య, భాస్కర్, సుధాకర్‌తో పాటు వివిధ పత్రికల్లో పనిచేస్తున్న జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


