తెలకపల్లి, అక్టోబర్ 11: ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్, ‘కాక్రోచ్ జనతా పార్టీ’తో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణలను బీజేపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు జెట్టి వెంకటేష్ ఆదేశాల మేరకు ఆదివారం సాయంత్రం నాగర్‌కర్నూల్ జిల్లా తెలకపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా బీజేపీ ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షుడు ఈర్లపల్లి శ్రీనివాసులు ముదిరాజ్ మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయ లబ్ధి కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై నిరాధార ఆరోపణలు చేయడం మానుకోవాలని ప్రతిపక్ష పార్టీలకు హితవు పలికారు. విమర్శలు చేసే ముందు వాస్తవాలను తెలుసుకోవాలని, ఆరోపణలు చేస్తే వాటికి తగిన ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు.
ప్రజాస్వామ్యంలో విమర్శించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని, అయితే ఆ హక్కును బాధ్యతాయుతంగా వినియోగించుకోవాలని అన్నారు. ప్రధాని మోదీపై వ్యక్తిగత విమర్శలు చేస్తూ ప్రజల్లో అపోహలు సృష్టించే ప్రయత్నాలను సహించబోమని హెచ్చరించారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఆరోపణలు చేయడం కాకుండా ప్రజా సమస్యలు, దేశాభివృద్ధి, సంక్షేమ అంశాలపై చర్చకు రావాలని ప్రతిపక్ష పార్టీలకు సూచించారు.
సినీ నటుడు ప్రకాష్ రాజ్ ప్రధానమంత్రి మోదీపై చేస్తున్న విమర్శలను కూడా ఈర్లపల్లి శ్రీనివాసులు ముదిరాజ్ ఖండించారు. దేశాభివృద్ధి, ప్రజా సంక్షేమం వంటి అంశాలపై నిర్మాణాత్మక చర్చ జరపాలని, నిరాధార ఆరోపణలతో రాజకీయ వాతావరణాన్ని కలుషితం చేయవద్దని పేర్కొన్నారు. ప్రధాని మోదీపై విమర్శలు చేసే వారు తమ ఆరోపణలకు ఆధారాలు చూపించాలని, లేనిపక్షంలో ప్రజలకు సమాధానం చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు.
ఈ మీడియా సమావేశంలో బీజేవైఎం కార్యవర్గ సభ్యుడు భాను ప్రకాష్ గౌడ్, బీజేవైఎం ఐటీ కో-కన్వీనర్ రమేష్ పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్‌లు (Tags):


