తెలకపల్లి, అక్టోబర్ 11: అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్కు చెందిన శ్రీ శారద ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో అందించే “ఎక్సలెన్స్ అవార్డ్ ఆఫ్ ది ఇయర్–2026” పురస్కారాన్ని నాగర్కర్నూల్ జిల్లా, తెలకపల్లి మండలం, వట్టిపల్లి ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బి. జైపాల్ అందుకున్నారు. ఆదివారం హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ఇటిక్యాల పురుషోత్తం చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని స్వీకరించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి విశేషంగా కృషి చేయడం, విద్యారంగంలో వినూత్న ఆలోచనలతో ముందుకు సాగడం, విద్యార్థుల్లో విద్యా నైపుణ్యాలతో పాటు నైతిక విలువలు, సామాజిక బాధ్యతను పెంపొందించడం వంటి అంశాలను గుర్తించి ఈ అవార్డును అందజేశారు.
విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడంతో పాటు, ప్రాథమిక స్థాయి నుంచే వారిలో నైతిక విలువలు, సామాజిక బాధ్యత, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తూ భవిష్యత్తులో సమాజానికి ఆదర్శంగా నిలిచే పౌరులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో జైపాల్ చేస్తున్న కృషికి ఈ పురస్కారం గుర్తింపుగా నిలిచింది.
ఈ సందర్భంగా అవార్డు గ్రహీత బి. జైపాల్ మాట్లాడుతూ, “మారుమూల ప్రాంతమైన వట్టిపల్లి ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు ఈ పురస్కారం నాలో మరింత ప్రోత్సాహాన్ని, పట్టుదలను పెంపొందిస్తుంది. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ, వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేయడానికి మరింత బాధ్యతతో కృషి చేస్తాను” అని తెలిపారు.
పాఠశాల అభివృద్ధికి సహకరిస్తున్న తోటి ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, దాతలు, గ్రామ యువకులు, విద్యార్థుల తల్లిదండ్రులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అందరి సహకారం, సమష్టి కృషితోనే ప్రభుత్వ పాఠశాలను మరింత అభివృద్ధి చేయగలమని పేర్కొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


