ఘట్కేసర్, అక్టోబర్ 10 (తొలి కిరణం):
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ సంబరాలు మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ సర్కిల్ పరిధిలోని పోచారం 8వ డివిజన్ సంస్కృతి టౌన్షిప్లో ఘనంగా నిర్వహించారు. శ్రీ గిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ చైర్మన్ మెట్టు బాల్రెడ్డి ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన ఈ వేడుకల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని సందడి చేశారు. బతుకమ్మ పండుగలో మొదటి రోజైన ఎంగిలిపూల బతుకమ్మను పురస్కరించుకుని రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా అలంకరించి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.
సంప్రదాయ దుస్తులు ధరించిన మహిళలు బతుకమ్మల చుట్టూ చేరి పాటలు పాడుతూ, చప్పట్లు కొడుతూ, సంప్రదాయ నృత్యాలతో ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. పూలతో అందంగా అలంకరించిన బతుకమ్మలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మహిళల ఆటపాటలతో ఆలయ ప్రాంగణమంతా పండుగ వాతావరణం నెలకొంది.
ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ మెట్టు బాల్రెడ్డి మాట్లాడుతూ, బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి, సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. ఎంగిలిపూల బతుకమ్మతో పండుగ సంబరాలు ప్రారంభమయ్యాయని, మహిళలందరూ ఐకమత్యంతో, సంతోషంగా కలిసి పండుగను జరుపుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ వేడుకల్లో పాల్గొన్న మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని మొదటిరోజు ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలను ఆనందోత్సాహాల మధ్య ఘనంగా నిర్వహించారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):



