బిజినేపల్లి, అక్టోబర్ 10 (తొలి కిరణం): మండలంలోని పాలెం గ్రామంలో మద్యం కల్లు విక్రయాలు, కల్తీ కల్లు అమ్మకాలపై గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కల్లు విక్రయాల్లో నిబంధనలు పాటించకుండా, కల్లు ధరలను పెంచి విక్రయిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. కల్లు దుకాణాల్లో (షాపుల్లో) సీసాలను శుభ్రపరచకుండా మళ్లీ కల్లు విక్రయిస్తున్నారని, దీనివల్ల ప్రజల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కల్తీ కల్లు తయారీ, విక్రయాలపై ఎక్సైజ్ శాఖ అధికారులు తక్షణమే స్పందించి తనిఖీలు నిర్వహించాలని గ్రామస్తులు కోరుతున్నారు. కల్లు విక్రయాల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకోవాలని, స్వచ్ఛమైన కల్లు విక్రయించేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కాసుల కక్కుర్తితో కల్తీ కల్లు విక్రయాలను అధికారులు అరికట్టలేకపోతున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు.
ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ స్పందించి కల్లు దుకాణాలపై తనిఖీలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని, కల్తీ కల్లు విక్రయాలు చేస్తున్న వారిపై, నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పాలెం గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సంబంధిత అధికారులు తక్షణమే స్పందించాలని కోరుతున్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


