వట్టెం (తొలి కిరణం): వట్టెం గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించడంతో పాటు ఉచిత న్యాయ సేవల వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నాగర్కర్నూల్ న్యాయ సేవా సంస్థ కార్యదర్శి నిహారిక, ప్రభుత్వ న్యాయవాది శ్రీరామ్ ఆర్య హాజరయ్యారు. ఈ సందర్భంగా న్యాయ నిపుణులు మాట్లాడుతూ పోక్సో చట్టంతో పాటు వివిధ చట్టాలు, కేసులకు సంబంధించిన న్యాయపరమైన అంశాలను వివరించారు. బాధితులు న్యాయం పొందేందుకు అందుబాటులో ఉన్న ఉచిత న్యాయ సేవలను ఎలా వినియోగించుకోవాలో తెలియజేశారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఎవరూ న్యాయ సహాయానికి దూరం కాకూడదని, అర్హులైన వారు న్యాయ సేవా సంస్థలను సంప్రదించి ఉచితంగా న్యాయ సహాయం పొందవచ్చని తెలిపారు. గ్రామీణ ప్రజలు చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని, తమ హక్కుల గురించి తెలుసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పిట్టల జ్యోతి, గ్రామ కార్యదర్శి మహేష్, వార్డు సభ్యులు, రైతులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ప్రజలకు న్యాయపరమైన అంశాలపై అవగాహన కల్పించి, ఉచిత న్యాయ సేవలపై అవగాహన పెంపొందించడమే కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.


