బిజినేపల్లి, తొలి కిరణం న్యూస్: నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండల కేంద్రంలో మైనర్ల బైక్ విన్యాసాలు స్థానికులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. కొందరు మైనర్లు మితిమీరిన వేగంతో బైకులు నడుపుతూ, సైలెన్సర్లను తొలగించి భారీ శబ్దాలతో రహదారులపై తిరుగుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో ప్రధాన రహదారులపై వెళ్లే పాదచారులు, ఇతర వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారని చెబుతున్నారు.
ముఖ్యంగా 8వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థుల్లో కొందరు బైక్ విన్యాసాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకే బైక్‌పై ముగ్గురు, నలుగురు ప్రయాణిస్తూ ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని, ప్రమాదకరంగా వాహనాలు నడపడం వల్ల తమతో పాటు ఇతరుల ప్రాణాలకూ ముప్పు కలిగిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మత్తు పదార్థాల వినియోగంపై ఆందోళన
కొంతమంది విద్యార్థులు మద్యం, గంజాయి, సిగరెట్ల వంటి మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. చదువుపై దృష్టి సారించాల్సిన వయసులో కొందరు విద్యార్థులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ తమ భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టుకుంటున్నారని తల్లిదండ్రులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బైక్ ప్రమాదాల్లో గాయాలపాలవుతున్న ఘటనలు జరుగుతున్నా కొందరిలో మార్పు కనిపించడం లేదని పేర్కొంటున్నారు.
పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలి
బిజినేపల్లి ప్రధాన రహదారులు, రద్దీగా ఉండే ప్రాంతాల్లో మైనర్ల బైక్ రైడింగ్‌పై పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ ప్రమాదకరంగా వాహనాలు నడిపే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని, నిబంధనలకు విరుద్ధంగా అమర్చిన సైలెన్సర్లపై తనిఖీలు నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మైనర్లకు వాహనాలు ఇచ్చే తల్లిదండ్రులకు కూడా నిబంధనలపై అవగాహన కల్పించడంతో పాటు, చట్టప్రకారం బాధ్యత వహించాల్సిన సందర్భాల్లో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి బైక్ విన్యాసాలకు అడ్డుకట్ట వేసి ప్రజల భద్రతకు భరోసా కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్‌లు (Tags):


