తెలకపల్లి, అక్టోబర్ 9 (తొలి కిరణం): మండల కేంద్రం తెలకపల్లిలో ఓ వ్యక్తికి చెందిన పెంపుడు కుక్క గురువారం రాత్రి అబ్దుల్ అహద్ అనే బాలుడిని కరవడంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. ఇదే కుక్క గతంలోనూ పలువురిని కరిచిన ఘటనలు ఉన్నాయని స్థానికులు తెలిపారు. ఈ విషయాన్ని గతంలోనే సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా ఇప్పటివరకు తగిన చర్యలు తీసుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పెంపుడు కుక్కల దాడులతో చిన్నారులు, ప్రజల భద్రతకు ముప్పు ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కుక్క కాటు వల్ల రేబిస్ వంటి ప్రాణాంతక వ్యాధుల ప్రమాదం ఉండటంతో అధికారులు తక్షణమే స్పందించాలని కోరారు. పెంపుడు కుక్కల యజమానులు బాధ్యతగా వ్యవహరించేలా చర్యలు తీసుకోవడంతో పాటు, గతంలో జరిగిన ఘటనలను పరిశీలించి, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు చేపట్టాలని స్థానికులు సంబంధిత అధికారులను డిమాండ్ చేశారు.


