తెలకపల్లి, బుధవారం: మండల కేంద్రంలోని నివాస ప్రాంతాల్లో కొనసాగుతున్న స్క్రాప్ వ్యాపారాలపై స్థానికుల ఫిర్యాదులతో గ్రామ పంచాయతీ అధికారులు చర్యలకు ఉపక్రమించారు. పంచాయతీ కార్యదర్శి భాస్కర్ స్క్రాప్ వ్యాపారులను హెచ్చరిస్తూ, ఇళ్ల మధ్య పేరుకుపోయిన స్క్రాప్ సామగ్రిని వారం రోజుల్లోగా పూర్తిగా తొలగించాలని ఆదేశించారు. గడువులోగా తొలగించకపోతే నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
దోమలు, విషపురుగులతో భయం..
ఇళ్ల మధ్య ప్లాస్టిక్, ఇనుము, ఇతర స్క్రాప్ వ్యర్థాలు పెద్దఎత్తున పేరుకుపోవడంతో ప్రజారోగ్యానికి ముప్పు ఏర్పడుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యర్థాల్లో నీరు నిల్వ ఉండటంతో దోమల సంఖ్య పెరుగుతోందని, దుర్వాసనతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. దోమల ద్వారా వ్యాధులు వ్యాపించే ప్రమాదంతో పాటు పాములు, విషపురుగులు ఇళ్లలోకి వస్తుండటంతో చిన్నారులు, వృద్ధుల భద్రతపై ఆందోళన నెలకొంది.
వాహనాల రాకపోకలకు ఇబ్బందులు
నివాస ప్రాంతాల్లో స్క్రాప్ సామగ్రిని రోడ్ల పక్కన, ఇళ్ల మధ్య నిల్వ చేయడంతో వాహనాల రాకపోకలకు కూడా అంతరాయం కలుగుతోందని స్థానికులు తెలిపారు. ప్రజారోగ్యం, పారిశుద్ధ్యం, ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని నివాస ప్రాంతాల్లో స్క్రాప్ వ్యాపారాలకు అనుమతి ఇవ్వకుండా, గ్రామానికి బయట ప్రత్యేక ప్రాంతాన్ని కేటాయించి అక్కడే ఇలాంటి వ్యాపారాలు నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


