హైదరాబాద్: జీహెచ్ఎంసీ మెహిదీపట్నం టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ టి. సునీత రూ.4 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఖైరతాబాద్ జోనల్ కార్యాలయం ఎదురుగా లంచం తీసుకుని తన కారులో పెట్టుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
ఓ భవన నిర్మాణానికి సంబంధించిన నిబంధనల ఉల్లంఘనలపై జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ ఆదేశాలు జారీ చేసినప్పటికీ, వాటిని పక్కనపెట్టి నిర్మాణాన్ని కొనసాగించేందుకు అనుమతించేలా నిర్మాణదారుడి నుంచి సూపర్వైజర్ రూ.8 లక్షలు డిమాండ్ చేసినట్టు ఏసీబీ అధికారులు తెలిపారు. ఇందులో తొలి విడతగా రూ.4 లక్షలు ఇవ్వాలని కోరినట్టు పేర్కొన్నారు.
దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా, పక్కా ప్రణాళికతో వలపన్నిన అధికారులు సునీతను లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. లంచం మొత్తంతో పాటు ఆమె వద్ద నిర్వహించిన సోదాల్లో లెక్కల్లో చూపని మరో రూ.2.50 లక్షలు కూడా గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
మొత్తంగా రూ.6.50 లక్షలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకుని సునీతను అరెస్టు చేశారు. అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి తదుపరి విచారణ నిమిత్తం నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక కోర్టుకు తరలించారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


