సికింద్రాబాద్: నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి స్థలాలను రిజిస్ట్రేషన్ చేసుకుంటూ, ఇతరుల ఆస్తులను కాజేస్తున్న ముఠాను ఎస్‌ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. 1982 నాటి డాక్యుమెంట్లను సైతం నకిలీగా సృష్టించి, ఫోర్జరీ జీపీఏ పత్రాలు తయారు చేసినట్లు పోలీసులు గుర్తించారు.
పలు రకాల సేల్ డీడ్‌లను సృష్టించి విదేశాల్లో నివసిస్తున్న వ్యక్తులకు చెందిన ఆస్తులను కాజేసేందుకు ముఠా ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. అమెరికాలో ఉన్న వ్యక్తుల పేర్లతోనూ నకిలీ డాక్యుమెంట్లు తయారు చేసినట్లు వెల్లడించారు.
ఈ వ్యవహారంలో ఎల్‌బీనగర్‌లో మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి పలు స్టాంప్ పేపర్లు, స్టాంపులను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు 8 చోట్ల నకిలీ డాక్యుమెంట్ల ఆధారంగా మార్టిగేజ్ చేసిన ఆస్తులను విడుదల చేసినట్లు ఎస్‌ఓటీ పోలీసులు గుర్తించారు.
నకిలీ పత్రాలతో ఆస్తుల రిజిస్ట్రేషన్లకు పాల్పడుతున్న వారిపై ప్రత్యేక దృష్టి సారించామని సీపీ సుమతి తెలిపారు. తప్పు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు అవసరమైతే పీడీ యాక్ట్ కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్‌లు (Tags):


