నాగర్‌కర్నూల్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరచడంతో పాటు విద్యార్థులకు అందుతున్న మధ్యాహ్న భోజన పథకం అమలును పటిష్ఠంగా నిర్వహించేందుకు జిల్లా విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్ బుధవారం ఒకేరోజు జిల్లాలోని పలు పాఠశాలలను సుడిగాలి పర్యటనగా సందర్శించి విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.
నాగర్‌కర్నూల్‌లోని స్థానిక పీఎస్ బాలికల పాఠశాల, తాడూరు మండలంలోని ఇంద్రకల్ పాఠశాల, యూపీఎస్ ఐతోల్, యూపీఎస్ పాపగల్ పాఠశాలలను డీఈఓ సందర్శించారు. అనంతరం తిమ్మాజిపేట మండలంలోని జడ్పీహెచ్ఎస్, కేజీబీవీ తిమ్మాజిపేట పాఠశాలలను కూడా పరిశీలించారు.
ఈ సందర్భంగా పాఠశాలల్లో విద్యార్థుల హాజరు, బోధన–అభ్యసన ప్రక్రియ, విద్యార్థుల విద్యా సామర్థ్యాలు, ఉపాధ్యాయుల బోధనా విధానాలను డీఈఓ రమేష్ కుమార్ పరిశీలించారు. విద్యార్థుల్లో అభ్యసనా సామర్థ్యాలను పెంపొందించేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. ప్రతి విద్యార్థి విద్యా పురోగతిని నిరంతరం పరిశీలిస్తూ, వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఉపాధ్యాయులకు సూచనలు చేశారు.
అలాగే పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకంపై కూడా డీఈఓ ప్రత్యేకంగా పరిశీలన చేపట్టారు. విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన, పరిశుభ్రమైన భోజనం అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. భోజన తయారీ, వంటశాల పరిశుభ్రత, విద్యార్థులకు భోజనం అందించే విధానం తదితర అంశాలను పరిశీలించారు.
గత రెండు నెలలుగా జిల్లాలో విద్యా ప్రమాణాలను పెంచడమే ప్రధాన లక్ష్యంగా జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో పాఠశాలలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోంది. ఈ పర్యవేక్షణ ద్వారా పాఠశాలల్లో బోధనా ప్రమాణాలు మెరుగుపడటంతో పాటు విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాల్లో కూడా పురోగతి సాధించే అవకాశం ఉందని ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.
జిల్లాలోని ప్రతి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు మధ్యాహ్న భోజన పథకం సక్రమంగా అమలు కావడానికి జిల్లా విద్యాశాఖ తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని వారు పేర్కొన్నారు. పాఠశాలలపై ఇదే తరహాలో నిరంతర పర్యవేక్షణ కొనసాగితే జిల్లాలో విద్యా ప్రమాణాలు మరింత మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ పర్యటనలో జిల్లా విద్యాధికారితో పాటు డీఎస్ఓ శైలజ, సీఎంఓ నిర్మల తదితరులు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


