బిజినపల్లి:
బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి జీవితాంతం కృషి చేసిన మాజీ ఐఏఎస్ అధికారి ఎస్.ఆర్. శంకరన్ 16వ వర్ధంతి సభ బుధవారం (అక్టోబర్ 7) బిజినపల్లి మండల పరిధిలోని గంగారం ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ సంఘాల నాయకులు, కుల సంఘాల ప్రతినిధులు, మేధావులు, విద్యార్థులు ఎస్.ఆర్. శంకరన్‌కు ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ప్రజావాగ్గేయకారుడు రాజారాం ప్రకాష్ మాట్లాడుతూ విద్య ద్వారానే సామాజిక మార్పు సాధ్యమవుతుందని అన్నారు. ముఖ్యంగా దళిత, బడుగు, బలహీన, గిరిజన, ఆదివాసీ విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించాలని సూచించారు. విద్య ద్వారా సామాజికంగా ఎదిగి, సమాజ మార్పుకు కృషి చేయడమే ఎస్.ఆర్. శంకరన్‌కు అందించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.
బాబాసాహెబ్ అంబేద్కర్, జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, గౌతమ బుద్ధుడు, పెరియార్ రామస్వామి నాయకర్, నారాయణగురు, బసవేశ్వరుడు, వీరబ్రహ్మం, సంత్ సేవాలాల్, సంత్ గాడ్గే బాబా, భాగ్యరెడ్డి వర్మ వంటి మహనీయుల ఆశయాల బాటలో ఎస్.ఆర్. శంకరన్ నడిచారని రాజారాం ప్రకాష్ అన్నారు.
దళితులు, గిరిజనులు, పీడిత వర్గాల సేవకే తన అధికారాన్ని అంకితం చేసిన ఎస్.ఆర్. శంకరన్ నీతి, నిజాయితీ, మానవత, ప్రజాస్వామ్యం, న్యాయం, శాంతి వంటి విలువలకు ప్రతీకగా నిలిచారని కొనియాడారు. తాను నమ్మిన విలువలకు కట్టుబడి నిస్వార్థ జీవితాన్ని గడిపిన వ్యక్తిగా ఆయనను గుర్తు చేశారు.
నెల్లూరు జిల్లా కలెక్టర్‌గా, సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా, అస్సాం, త్రిపుర రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శిగా, జాతీయ గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శిగా, ఆహార భద్రతపై సుప్రీంకోర్టు నియమించిన కమిటీ కమిషనర్‌గా ఎస్.ఆర్. శంకరన్ వివిధ బాధ్యతలు నిర్వహించారని తెలిపారు.
పీడిత వర్గాల హక్కుల కోసం దేశవ్యాప్తంగా పర్యటిస్తూ వారి సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లారని, వెట్టి చాకిరీ నిర్మూలన, జోగిని వ్యవస్థ నిర్మూలన, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన, ఆదివాసీల హక్కులు, భూసంస్కరణలు వంటి అంశాలపై కృషి చేశారని పేర్కొన్నారు.
ప్రభుత్వానికి, నక్సలైట్లకు మధ్య చర్చల సమయంలో ఆయన సంధానకర్తగా వ్యవహరించి శాంతి చర్చలకు కృషి చేశారని రాజారాం ప్రకాష్ గుర్తుచేశారు. దేశంలోని కలెక్టర్లు, ఎస్పీలు, ప్రభుత్వ ఉద్యోగులు ఎస్.ఆర్. శంకరన్ సేవలు, విలువలను స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో రత్న శేఖర్, రాజప్ప, కోములయ్య, నందకిషోర్, ఇందుమతి, ఊర్మిళతో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


