కోడూరు, అక్టోబర్ 4: తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గ పరిధిలోని అబ్బినాయుడుపల్లెలో 10 ఏళ్ల మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిపై వెంటనే పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆదివారం గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర కౌన్సిల్ నాయకులు సీహెచ్ చంద్రశేఖర్, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు లతీఫ్ మాట్లాడుతూ.. బాలికపై జరిగిన ఘటనపై పోలీసులు తక్షణమే చర్యలు తీసుకుని నిందితుడిని అరెస్టు చేసి చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలని, బాలికకు రక్షణ కల్పించడంతో పాటు విద్యార్థులు, మహిళల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. ఘటనపై ఫిర్యాదు చేసినప్పటికీ నిందితుడిపై చర్యలు ఆలస్యం కావడంపై వారు ప్రశ్నించారు. నిందితుడిని చట్ట ప్రకారం కోర్టులో హాజరుపరిచి తదుపరి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అనంతరం సీఐటీయూ రాష్ట్ర కౌన్సిల్ నాయకులు సీహెచ్ చంద్రశేఖర్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం ఆర్థికంగా, సామాజికంగా అండగా నిలవాలని కోరారు. అలాగే ఆటోడ్రైవర్లకు అవగాహన కల్పించాలని, రాత్రి వేళల్లో విద్యార్థుల రవాణాపై ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకోవాలని పోలీసులను, ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలను కోరారు. ఈ కార్యక్రమంలో ఓబులవారిపల్లి మండల నాయకులు నాగపూర్ పెంచలయ్య, ఎస్ఎఫ్ఐ కోడూరు అధ్యక్షులు బి.బాలాజీ, కార్యదర్శి, డీవైఎఫ్ఐ కో-కన్వీనర్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


