తెలకపల్లి, అక్టోబర్ 4 (తొలి కిరణం): తెలకపల్లి మండలం కమ్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన మొగిలి పర్వతాలు (48) అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటనపై తెలకపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై ఎం. రమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. కమ్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన మొగిలి పర్వతాలు, భార్య రేణుకతో కలిసి గ్రామంలో నివసిస్తున్నాడు. వీరికి ముగ్గురు కుమారులు కాగా, వారు వృత్తిరీత్యా ఖమ్మం, జడ్చర్ల, హైదరాబాద్లో నివసిస్తున్నారు. రెండు రోజుల క్రితం రేణుక అనారోగ్య కారణాలతో ఆలేరు గ్రామానికి వెళ్లింది.
అక్టోబర్ 3న ఉదయం పర్వతాలు తమ గ్రామానికి చెందిన గోవిందు, భాష అనే ఇద్దరితో కలిసి రాకొండ గ్రామ శివారులోని చింతకుంట చెరువుకు చేపలు పట్టేందుకు వెళ్లాడు. చేపలు పడుతున్న క్రమంలో పర్వతాలు నీటిలో మునిగిపోగా, గోవిందు, భాష అతడిని బయటకు తీసుకువచ్చి పరిశీలించగా అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో వారు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.
తమ తండ్రి మృతిపై అనుమానం ఉందని మృతుడి పెద్ద కుమారుడు మొగిలి యాదయ్య తెలకపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతికి గల పూర్తి కారణాలు దర్యాప్తులో తేలాల్సి ఉంది.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


