నాగర్కర్నూల్లో స్వచ్ఛ భారత్ దినోత్సవం సందర్భంగా మున్సిపల్ పారిశుధ్య కార్మికులను భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ క్రాంతి కుమార్ శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా క్రాంతి కుమార్ మాట్లాడుతూ సమాజ ఆరోగ్యం, పరిశుభ్రత కోసం ప్రతిరోజూ నిరంతరం సేవలందిస్తున్న సఫాయి కార్మికుల సేవలు ఎంతో గొప్పవని కొనియాడారు. పారిశుధ్య కార్మికులు అందిస్తున్న సేవల వల్ల ప్రజలు అనేక అనారోగ్య సమస్యల నుంచి రక్షణ పొందుతున్నారని, పరిశుభ్రమైన వాతావరణం, ప్రజారోగ్య పరిరక్షణలో వారి పాత్ర ఎంతో కీలకమని అన్నారు. స్వచ్ఛత అనేది కేవలం ఒకరోజు నిర్వహించే కార్యక్రమం కాకుండా ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని ఆయన సూచించారు. పారిశుధ్య కార్మికుల సేవలను గౌరవిస్తూ వారికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ప్రజారోగ్యం, పరిశుభ్రమైన పరిసరాలు, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో పారిశుధ్య కార్మికుల పాత్రను ప్రతి ఒక్కరూ గుర్తించాలని అన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాగర్కర్నూల్ జిల్లా జనరల్ సెక్రటరీ పంజాగుల్ల నాగేందర్ గౌడ్, బీజేపీ నాగర్కర్నూల్ జిల్లా లేబర్ సెల్ కన్వీనర్ అతినారపు వెంకటేష్, ఓబీసీ మోర్చా నాగర్కర్నూల్ జిల్లా ఉపాధ్యక్షులు ఈర్లపల్లి శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు పారిశుధ్య కార్మికులకు అభినందనలు తెలియజేస్తూ, సమాజానికి వారు అందిస్తున్న సేవలకు కృతజ్ఞతలు తెలిపారు.


