పాలెం నుంచి గుడ్లనర్వ వెళ్లే మార్గంలోని బ్రిడ్జి కింద భారీగా టాబ్లెట్లు, మెడిసిన్ స్ట్రిప్‌లు, మందుల బాక్సులు, ఖాళీ ప్యాకెట్లు బహిరంగంగా పడివుండటం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. బ్రిడ్జి కింద పెద్ద మొత్తంలో వివిధ రకాల మందులు చెత్తగా కనిపించడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని మందుల ప్యాకెట్లపై “Telangana Government Supply – Not for Sale” అనే వివరాలు కూడా కనిపిస్తున్నాయి.
ఆపద సమయంలో ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లినప్పుడు అవసరమైన మందులు అందుబాటులో లేక రోగులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో, ఇంత పెద్ద మొత్తంలో మందులు బహిరంగ ప్రదేశంలో పడివుండటంపై ప్రజలు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఈ మందులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరు ఇక్కడికి తీసుకొచ్చి పడేశారు? ఎందుకు ఇలా బహిరంగంగా పారవేశారు? వీటికి గడువు ముగిసిందా? లేక వినియోగించకుండా మిగిలిపోయిన ప్రభుత్వ సరఫరా మందులా? అనే విషయాలపై అధికారులు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది.
మందులను సాధారణ చెత్తతో కలిపి బహిరంగ ప్రదేశాల్లో పడేయడం వల్ల పర్యావరణంతో పాటు ప్రజలకు కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. అందువల్ల సంబంధిత వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు వెంటనే స్పందించి బ్రిడ్జి కింద ఉన్న మందులను పరిశీలించి, వాటి మూలాలను గుర్తించి, బాధ్యులెవరైనా ఉంటే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
ప్రభుత్వ మందులైతే వాటి సరఫరా, నిల్వ, వినియోగం, మిగులు మందుల వివరాలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):






