మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కీసర మండలంలో జర్నలిస్టులమంటూ చెప్పుకుంటూ తిరుగుతున్న కొందరి వ్యవహారాలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గుర్తింపు కార్డులు, సంబంధిత మీడియా సంస్థల అనుమతులు లేకుండానే ‘జర్నలిస్టు’ పేరుతో తిరుగుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో అధికారులు దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కొంతమంది వాహనాలపై ‘PRESS’ స్టిక్కర్లు ఏర్పాటు చేసుకుని తిరుగుతున్నారని, అధికారులు, ప్రజల వద్ద తమను మీడియా ప్రతినిధులుగా పరిచయం చేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే వారు ఏ మీడియా సంస్థకు పనిచేస్తున్నారు? సంస్థ నుంచి వారికి గుర్తింపు కార్డు ఉందా? సంబంధిత అనుమతులు ఉన్నాయా? అనే అంశాలపై స్పష్టత అవసరమని పలువురు కోరుతున్నారు.
జర్నలిజం పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు నిజమైతే వాటిపై సమగ్ర విచారణ జరిపి, ఆధారాలు లభిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
నిజాయితీగా ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తున్న జర్నలిస్టుల గౌరవానికి భంగం కలగకుండా సంబంధిత అధికారులు, మీడియా సంస్థలు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
‘PRESS’ స్టిక్కర్ పెట్టుకున్నంత మాత్రాన ఎవరైనా జర్నలిస్టుగా గుర్తింపు పొందుతారా? మీడియా ప్రతినిధులుగా చెప్పుకునే వారి గుర్తింపులను సంబంధిత అధికారులు ఎలా ధృవీకరిస్తారు? జర్నలిస్టు పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వస్తే వాటిపై ఎవరు విచారణ చేపడతారు? అనే ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉంది.
కీసరలో నిజమైన జర్నలిస్టులకు గౌరవం దక్కాలి.. జర్నలిజం పేరుతో అక్రమాలకు పాల్పడుతున్నట్లు తేలితే బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


