నాగర్కర్నూల్: సామాజిక ఆరోగ్య భద్రతలో పారిశుద్ధ్య కార్మికులు కీలక పాత్ర పోషిస్తున్నారని, వారి కుటుంబాల భద్రత కోసం ప్రతి ఒక్కరూ బీమా పాలసీలు పొందాలని నాగర్కర్నూల్ జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ చంద్రశేఖర్ సూచించారు. గురువారం తోడుకుర్తి గ్రామంతో పాటు జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో భాగంగా ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ తక్కువ ప్రీమియంతో అందుబాటులో ఉన్న ప్రభుత్వ బీమా పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన, పదేళ్లలోపు బాలికల కోసం సుకన్య సమృద్ధి యోజన వంటి పథకాలపై అవగాహన కల్పించారు. అలాగే పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గుర్తుతెలియని వ్యక్తులకు బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీలు, పాస్వర్డ్లు తదితర సమాచారాన్ని వెల్లడించవద్దని సూచించారు. అనంతరం స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో సేవలందిస్తున్న సఫాయి కార్మికులను ఘనంగా సన్మానించి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ సిబ్బంది లక్ష్మణ్, సీ.ఎఫ్.ఎల్. కౌన్సిలర్లు శశిపాల్ రెడ్డి, రాకేష్, బిజినెస్ కరస్పాండెంట్లు మల్లయ్య, సాయి శంకర్, ఎఫ్ఎల్సీ శేషయ్య తదితరులు పాల్గొన్నారు.


