నాగర్‌కర్నూల్: ఎస్ఐఆర్-2026 ప్రక్రియలో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎన్నికల సిబ్బంది ‘పబ్లిక్ ఫస్ట్’ నినాదంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి హేమంత్ కేశవ్ పాటిల్ సూచించారు. నోటీసులు జారీ చేసిన అనంతరం హియరింగ్‌కు హాజరుకాని ఓటర్ల ఇంటి వద్దకే బూత్ లెవెల్ అధికారులు వెళ్లి సంబంధిత ధ్రువపత్రాలను సేకరించాలని ఆదేశించారు. గురువారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎన్నికల అధికారి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, అదనపు కలెక్టర్ చెన్నయ్య, సబ్‌కలెక్టర్ సలోని చాబ్రాతో కలిసి పాల్గొన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియను భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం పారదర్శకంగా, క్షేత్రస్థాయిలో కచ్చితంగా అమలు చేయాలని రాష్ట్ర ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి సూచించారు. రాష్ట్రంలో 100 శాతం నోటీసులు పంపిణీ చేసిన తొలి జిల్లాగా నాగర్‌కర్నూల్ నిలిచిందని కలెక్టర్ తెలిపారు. ఇప్పటివరకు 263 అనర్హ ఓట్లుగా గుర్తించగా, ఫారం-6, 7, 8 ద్వారా మొత్తం 6,665 దరఖాస్తులు అందినట్లు అధికారులు వివరించారు. వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఏఈఆర్ఓలను కలెక్టర్ ఆదేశించారు. అవసరమైన సందర్భాల్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం ఆన్లైన్ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చని, అయితే ఓటర్లకు ఎలాంటి ఆటంకాలు కల్పించరాదని స్పష్టం చేశారు. అన్‌మ్యాపింగ్ వివరాలను సంబంధిత ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు తమ కార్యాలయాల నోటీసు బోర్డుల్లో ప్రదర్శించాలని సూచించారు. అలాగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదును ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం చేపట్టాలని కలెక్టర్ తెలిపారు. 31.10.2023 నాటికి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అర్హులు సంబంధిత నియోజకవర్గానికి చెందినవారైతే నమోదు చేసుకోవచ్చని, ప్రస్తుత ప్రక్రియకు 01.11.2026ను అర్హత తేదీగా పరిగణించాలని తెలిపారు. గతంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్లుగా నమోదైన వారు కూడా ప్రస్తుత ప్రక్రియలో మరోసారి నమోదు చేసుకోవాలని సూచించారు. సమావేశంలో ఓటరు నమోదు అధికారులు, కలెక్టరేట్ ఎన్నికల విభాగం అధికారులు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.


