హైదరాబాద్, అక్టోబర్ 1: తెలంగాణ ఎస్సీ–ఎస్టీ కమిషన్ ప్రస్తుత పదవీకాలం అక్టోబర్ 3, 2026తో ముగియనున్న నేపథ్యంలో తదుపరి కమిషన్ చైర్మన్ నియామకంలో రొటేషన్ విధానాన్ని పాటించాలని తెలంగాణ మాదిగ జర్నలిస్ట్ ఫోరం (టీఎంజేఎఫ్) ప్రభుత్వాన్ని కోరింది. మాదిగ, అనుబంధ కులాల జర్నలిస్టులకు కమిషన్‌లో ప్రాధాన్యత కల్పించాలని ఫోరం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు భూర్గుల నాగేందర్ మాదిగ, గౌరవ అధ్యక్షులు వత్తుల రఘుపతి మాదిగ, ప్రధాన కార్యదర్శి బొల్లెపాక రాజేష్ మాదిగ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్ హైదర్‌గూడలోని ఎన్ఎస్ఎస్ మీడియా సెంటర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లిన ముఖ్యమంత్రి, మంత్రిమండలి, కృషి చేసిన ప్రజాప్రతినిధులకు వారు కృతజ్ఞతలు తెలిపారు. గతంలో కమిషన్‌కు కల్పించిన ప్రాతినిధ్యాన్ని సమీక్షించి, ఒకే ఉపకులం లేదా ప్రాంతానికే పరిమితం కాకుండా మాదిగ, మాలలతో పాటు అన్ని ఎస్సీ కులాలు, ప్రాంతాలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. కమిషన్ నియామకంలో మాదిగ, అనుబంధ కులాల జర్నలిస్టులకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయిలో అనుభవం ఉన్న జర్నలిస్టులను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. కుల అణచివేత, కుల వివక్ష నిర్మూలనపై దూరదృష్టి, సామాజిక సమస్యలపై అవగాహన ఉన్నవారికి కమిషన్‌లో అవకాశం కల్పించాలని అన్నారు. కుల వివక్ష, కుల బహిష్కరణ, సామాజిక వెలివేత, గ్రామస్థాయి ఘర్షణలు ముదిరిన తర్వాత స్పందించకుండా ముందుగానే సమస్యలను గుర్తించి నివారించే కార్యాచరణ ఉండాలని కోరారు. ముఖ్యంగా ఎస్సీ–బీసీ కులాల మధ్య ఘర్షణలకు దారితీసే సమస్యలను సంభాషణ, అవగాహన, చట్టపరమైన చర్యల ద్వారా పరిష్కరించే విధంగా కమిషన్ పనిచేయాలని అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర గౌరవ సలహాదారులు మైలారపు ప్రేమ్, సుంచు లింగయ్య, పసుల తిరుపతి, జిలకర కృష్ణాకర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కడియం నాగయ్య, దుబ్బ నగేష్, కార్యదర్శులు చెల్మెడ్ అనీల్, గంట వెంకన్న, మహంకాళి భిక్షపతి, ప్రచార కార్యదర్శులు కల్మకోల్ యాదయ్య, చింత ప్రవీణ్, కోశాధికారి బొట్ల సదానందం, అధికార ప్రతినిధి పంగిడిచెరువు వెంకటేష్, సహాయ కార్యదర్శి కాడేపగ శ్రీనివాస్, నాయకులు బొల్లె రాజయ్య, దరువుల శంకర్, మీసాల సైదులు, లంక స్వామి, ఎన్ఎల్ మహారాయుడు, బాలకృష్ణ, రామస్వామి, దేవరాజ్ తదితరులు పాల్గొన్నారు.


