తొలి కిరణం ప్రతినిధి, సెప్టెంబర్ 30: తిరుపతి జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మంగళవారం వెంకటగిరిలో నిర్వహిస్తున్న శ్రీశ్రీశ్రీ పోలేరమ్మ జాతర మహోత్సవాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి తాతశెట్టి నాగేంద్రతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మాట్లాడుతూ చారిత్రాత్మకమైన వెంకటగిరి పోలేరమ్మ జాతరలో పాల్గొని అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో అమ్మవారి ఆశీస్సులు పొందడం ఆనందదాయకమని తెలిపారు.
రోడ్డు విస్తరణ పనులు త్వరలో పూర్తి
రైల్వేకోడూరు–వెంకటగిరి రోడ్డు విస్తరణ పనులను త్వరలోనే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తెలిపారు. ఇరు ప్రాంతాల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందించేందుకు రహదారి పనులను పూర్తి చేయడానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజలందరిపై పోలేరమ్మ అమ్మవారి చల్లని చూపు ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు.
అనంతరం వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఎంతో పేరుగాంచిన పోలేరమ్మ జాతరకు భక్తులు లక్షలాదిగా తరలివస్తున్నారని తెలిపారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ జాతరకు విచ్చేసి అమ్మవారిని దర్శించుకోవడం సంతోషకరమన్నారు. ఇరు నియోజకవర్గాల అభివృద్ధికి, అనుసంధాన రహదారుల పూర్తికి కలిసికట్టుగా కృషి చేస్తామని తెలిపారు.
అమ్మవారి కృపాకటాక్షాలతో ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో రాజుగుంట నరసింహ, మాదాసు నరసింహ, ఏఎంసీ చైర్మన్, పట్టణ అధ్యక్షులు, ఏఎంసీ మాజీ అధ్యక్షులు, పోలేరమ్మ జాతర సేవా కమిటీ అధ్యక్షులు, వెంకటగిరి పీఏసీఎస్ అధ్యక్షులు, పట్టణ కమిటీ సభ్యులు, పోలేరమ్మ దేవస్థాన ఈఓ, జనసేన కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


