హైదరాబాద్: బీఎన్ రెడ్డి నగర్ చౌరస్తా సమీపంలోని న్యూ సంకల్ప డీ-అడిక్షన్ సెంటర్లో డి.ప్రతాప్ (45) అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన కలకలం రేపింది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం ప్రతాప్ గత రెండేళ్లుగా సదరు డీ-అడిక్షన్ సెంటర్లో పేషెంట్‌గా ఉంటున్నారు. అదే సమయంలో పేషెంట్ కమ్ వర్కర్‌గా కూడా అక్కడే ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ప్రతాప్ కుటుంబ సభ్యులు డీ-అడిక్షన్ సెంటర్‌కు ఫీజు చెల్లిస్తున్నప్పటికీ, సెంటర్ సిబ్బంది ఆయనతో పనులు చేయించారని, ఆ పనులకు ఎలాంటి జీతం చెల్లించలేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలపై సంబంధిత సెంటర్ వర్గాల వివరణ తెలియాల్సి ఉంది.
ఈ క్రమంలో బుధవారం ఉదయం ప్రతాప్ అదే భవనంలోని ఐదో అంతస్తు నుంచి కిందపడటంతో మృతి చెందినట్లు సమాచారం. ప్రతాప్ మరణంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అయితే ఆయన మరణం ప్రమాదవశాత్తు జరిగిందా, స్వయంగా కిందకు దూకారా లేదా మరేదైనా కారణం ఉందా అనే అంశంపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ప్రతాప్ మృతికి సంబంధించిన పూర్తి వాస్తవాలు వెలుగులోకి రావాలంటే పోలీసులు సమగ్ర దర్యాప్తు చేపట్టాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ముఖ్యంగా డీ-అడిక్షన్ సెంటర్లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించడంతో పాటు సిబ్బంది, ఇతర పేషెంట్ల వాంగ్మూలాలను నమోదు చేయాలని, ప్రతాప్‌కు సంబంధించిన వైద్య రికార్డులను పరిశీలించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
అలాగే పోస్టుమార్టం నివేదికను పరిగణనలోకి తీసుకుని, ఘటనకు దారితీసిన పరిస్థితులపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి నిజానిజాలను వెలుగులోకి తీసుకురావాలని, తమ కుటుంబానికి న్యాయం చేయాలని ప్రతాప్ కుటుంబ సభ్యులు పోలీసులను కోరారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


