పాలెం: పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ శ్రీ హేమంత్ కేశవ్ పాటిల్ ఆదేశాల మేరకు పాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో బుధవారం సఫాయిమిత్ర సురక్షా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని పాలెం సర్పంచ్ బోనాసి రామకృష్ణ ప్రారంభించారు. శిబిరాన్ని జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రఫిక్ ఆకస్మికంగా తనిఖీ చేసి, పారిశుద్ధ్య కార్మికులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. వీధులు, డ్రైనేజీలను శుభ్రం చేస్తూ ప్రజారోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న సఫాయిమిత్ర కార్మికుల సేవలను ఆయన ప్రత్యేకంగా కొనియాడారు. శిబిరంలో కార్మికులకు రక్తం, మూత్ర పరీక్షలతో పాటు బీపీ పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను అందజేశారు. విధులు నిర్వహించే సమయంలో కార్మికులు తీసుకోవాల్సిన ఆరోగ్య జాగ్రత్తలపై పాలెం వైద్యాధికారి డాక్టర్ ఎం. ప్రియాంక ప్రత్యేక సూచనలు అందించారు. శిబిరాన్ని విజయవంతం చేసిన ప్రజాప్రతినిధులు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులకు డాక్టర్ ప్రియాంక పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ గోవిందు శ్రీనివాసులు, డాక్టర్ సత్యలక్ష్మి, సీహెచ్ఓ శాంతాబాయి, హెల్త్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ బాదం రాజేశ్వర్, సూపర్వైజర్ గోవిందు సుజాత, హెల్త్ అసిస్టెంట్ గోవర్ధన్, ల్యాబ్ టెక్నీషియన్ నేష నారాయణ, స్టాఫ్ నర్స్ రూతు, ఆరోగ్య మిత్రలు శ్రీశైలం, మౌలాలి, విష్ణు, సమీర్, బాబా ఆసుపత్రి సిబ్బంది మధు, శిరీష, లక్ష్మమ్మతో పాటు వివిధ గ్రామాల నుంచి వచ్చిన సఫాయి కార్మికులు పాల్గొన్నారు.




