తొలి కిరణం ప్రతినిధి, వంగూరు: నాగర్కర్నూల్ జిల్లా వంగూరు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇలాంటి సమయంలో ప్రజలకు వైద్య సేవలు అందించాల్సిన వైద్యులు, నర్సులు తమ ఇష్టానుసారంగా విధులకు హాజరవుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఉదయం విధులకు హాజరై కొద్దిసేపటికే వెళ్లిపోతున్నారని, దీంతో వైద్యం కోసం పీహెచ్సీకి వచ్చే పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా పీహెచ్సీలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ నెలలో రెండు, మూడు రోజులు మాత్రమే విధులకు హాజరవుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనిపై సంబంధిత ఉన్నతాధికారులు దృష్టి సారించి, వాస్తవ పరిస్థితులపై విచారణ చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సిబ్బందిపై చర్యలు తీసుకుని, వంగూరు మండల ప్రజలకు నిరంతరాయంగా మెరుగైన వైద్య సేవలు అందేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


