వనపర్తి బ్యూరో, సెప్టెంబర్ 29: గిరిజనులకు ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ అండగా ఉంటుందని కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ తెలిపారు. మంగళవారం ఖిల్లా ఘనపురం మండలం ఎనికితాండాలో గిరిజనులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మండలంలోని 27 తండాల పరిధిలో సుమారు 460 ఎకరాల రాజా భూములకు సంబంధించిన సమస్యను గిరిజనులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. భూమిలేని నిరుపేదలకు న్యాయం చేయడానికే సీలింగ్ చట్టం ఉందని హుస్సేన్ పేర్కొన్నారు. ఏళ్లుగా భూములను సాగు చేసుకుంటున్న అర్హులైన పేదలకు హక్కులు కల్పిస్తే ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. భూ సమస్యపై పరిశీలన జరిపి రెండు నెలల్లోగా పరిష్కార మార్గం చూపేందుకు కృషి చేస్తానని హుస్సేన్ హామీ ఇచ్చారు. ప్రజావాణిలో గిరిజనులు సమర్పించే అర్జీలను అధికారులు సకాలంలో పరిశీలించాలని సూచించారు. అట్రాసిటీ చట్టాన్ని దుర్వినియోగం చేయకుండా నిజమైన అన్యాయాల సందర్భాల్లోనే వినియోగించాలని తెలిపారు. చిన్న వివాదాలకే కేసులు నమోదు చేయడం వల్ల చట్టం ప్రాధాన్యం తగ్గకుండా చూడాలని సూచించారు. ప్రజాప్రతినిధులు గిరిజనుల సమస్యలను తెలుసుకునేందుకు సమయం కేటాయించాలని కోరారు. గిరిజనుల సమస్యల పరిష్కారానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అనంతరం కర్నెతాండాలోని తుల్లా భవాని ఆలయంలో హుస్సేన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడ నూతనంగా నిర్మించిన ప్రభుత్వ ఆస్పత్రిని కూడా పరిశీలించారు. ఆస్పత్రి ప్రారంభమైనప్పటికీ వైద్య సేవలు అందుబాటులోకి రాలేదని స్థానికులు ఆయనకు ఫిర్యాదు చేశారు. దీనిపై సంబంధిత అధికారులతో చర్చించి ఆస్పత్రిని ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని హుస్సేన్ తెలిపారు.


