తొలి కిరణం, సెప్టెంబర్ 29, ఘట్కేసర్ ప్రతినిధి:
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్లో ఎక్సైజ్ అధికారులు మెరుపు దాడులు నిర్వహించి గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నారపల్లి సాయి టీచర్స్ కాలనీలో గంజాయి అక్రమ విక్రయాలపై నమ్మదగిన సమాచారం అందడంతో మల్కాజిగిరి ఎన్ఫోర్స్మెంట్ టీం ఏఈఎస్ ముస్తఫా సిద్ధిక్ ఆధ్వర్యంలో అధికారులు సోదాలు చేపట్టారు.
ఈ తనిఖీల్లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న షంషేర్ అలీఖాన్, మహమ్మద్ ఇర్ఫాన్లను అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా, విక్రయానికి సిద్ధంగా ఉంచిన 95 గంజాయి ప్యాకెట్లు లభించాయి. మొత్తం 285 గ్రాముల గంజాయి ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
విచారణలో నిందితులు మహారాష్ట్రలోని పర్భని ప్రాంతం నుంచి గంజాయిని తక్కువ ధరకు కొనుగోలు చేసి నగరానికి తరలించినట్లు వెల్లడించినట్లు అధికారులు తెలిపారు. ఒక్కో ప్యాకెట్లో మూడు గ్రాముల చొప్పున గంజాయి నింపి, యువతతో పాటు కార్మికులను లక్ష్యంగా చేసుకుని ఒక్కో ప్యాకెట్‌ను రూ.300 చొప్పున విక్రయిస్తున్నట్లు విచారణలో వెల్లడైనట్లు పేర్కొన్నారు.
అరెస్టు చేసిన ఇద్దరు నిందితులను, వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న గంజాయి ప్యాకెట్లను తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం ఘట్కేసర్ ఎక్సైజ్ స్టేషన్ సిబ్బందికి అప్పగించారు. అక్రమంగా మత్తు పదార్థాలు, గంజాయి విక్రయించే వారిపై కఠిన చర్యలు తప్పవని ఎక్సైజ్ అధికారులు హెచ్చరించారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


