వనపర్తి, సెప్టెంబరు 28: వనపర్తి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రి నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందని అఖిలపక్ష ఐక్యవేదిక నాయకులు ఆరోపించారు. వైద్యులు, పారిశుధ్యం, మౌలిక వసతుల కొరతతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు డా. సతీష్ యాదవ్ ఆధ్వర్యంలో నాయకులు ప్రభుత్వాసుపత్రిని పరిశీలించారు.
రక్త నమూనాలు సేకరించే ప్రదేశంలో ఆహార పదార్థాలు, చీపుర్లు, ఇతర సామగ్రి ఉండటాన్ని నాయకులు తప్పుబట్టారు. ఇలాంటి అపరిశుభ్ర వాతావరణంలో రోగులకు ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆసుపత్రి గోడలు పెచ్చులూడి ప్రమాదకరంగా మారినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
పేరుకే ప్రజాపాలన.. ప్రజలకు మాత్రం వైద్యం కరువైందని సతీష్ యాదవ్ విమర్శించారు. వందల కోట్ల అభివృద్ధి పనుల గురించి గొప్పలు చెప్పుకునే పాలకులు ప్రజలకు నేరుగా ఉపయోగపడే విద్య, వైద్య రంగాలను విస్మరిస్తున్నారని ఆరోపించారు. కమీషన్లు వచ్చే సివిల్ పనులపై చూపుతున్న శ్రద్ధ ప్రభుత్వాసుపత్రుల నిర్వహణపై ఎందుకు లేదని ప్రశ్నించారు.
పారిశుధ్య సిబ్బందిని ఇతర పనులకు వినియోగించడం వల్ల ఆసుపత్రిలో శుభ్రత దెబ్బతింటోందన్నారు. సంబంధిత ఏజెన్సీ గడువు ముగిసినా కొత్త టెండర్ ద్వారా పారిశుధ్య సిబ్బందిని నియమించకపోవడంపై కలెక్టర్ తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వనపర్తికి వచ్చే మంత్రులు ప్రభుత్వాసుపత్రి దుస్థితిని స్వయంగా పరిశీలించి ప్రజలకు పూర్తిస్థాయి వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు వెంకటేశ్వర్లు, టీడీపీ నాయకుడు కొత్తగొల్ల శంకర్, బీజేపీ నాయకుడు రవి, రామస్వామి, శివకుమార్, సురేష్ యాదవ్, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


