పాలెం: పాలెం గ్రామంలోని 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులు చదువుతున్న పాఠశాలలు, కళాశాలల్లో కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, హైదరాబాద్ వారి ఆదేశాల మేరకు నిషాముక్తి యువ–వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే ప్రపంచ రేబిస్ దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా పాలెం వైద్యాధికారి డాక్టర్ ఎం. ప్రియాంక మాట్లాడుతూ యువత మత్తు పదార్థాల వినియోగానికి దూరంగా ఉండాలని సూచించారు. గుట్కా, పొగాకు, సిగరెట్లు, గంజాయి తదితర మత్తు పదార్థాల వినియోగం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాలు పడతాయని తెలిపారు. కౌమార దశలో శారీరక, మానసిక మార్పుల కారణంగా యువత చెడు అలవాట్లకు త్వరగా ఆకర్షితులయ్యే అవకాశం ఉందని, విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మత్తు పదార్థాలు లేని భారతదేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములమవుతామని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.
విద్యార్థులు సమతుల్య ఆహారం తీసుకోవడంతో పాటు ప్రతిరోజూ శారీరక వ్యాయామం, యోగా, మెడిటేషన్ వంటి ఆరోగ్యకరమైన అలవాట్లను జీవితంలో భాగం చేసుకోవాలని తెలిపారు. క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడుపుతూ దేశానికి సేవ చేసే మంచి పౌరులుగా ఎదిగి కుటుంబానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
ఆర్బీఎస్కే వైద్యాధికారి డాక్టర్ అక్బర్ మాట్లాడుతూ ఆరోగ్యం అంటే కేవలం వ్యాధులు లేకపోవడం మాత్రమే కాదని, శారీరకంగా, మానసికంగా, సామాజికంగా దృఢంగా ఉండటమే సంపూర్ణ ఆరోగ్యమని తెలిపారు. ఆరోగ్యంగా ఉండేందుకు తాజా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, చిరుధాన్యాలు తదితర పోషకాహారాన్ని సమతుల్యంగా తీసుకోవాలని సూచించారు.
హెల్త్ అసిస్టెంట్ గోవర్ధన్ మాట్లాడుతూ కుక్క, పిల్లి, గబ్బిలం వంటి జంతువులు కరిచినప్పుడు లేదా గీచినప్పుడు వాటి లాలాజలం ద్వారా రేబిస్ వ్యాధి సోకే అవకాశం ఉందని తెలిపారు. కుక్క కరిచిన వెంటనే గాయంపై ధారాళంగా నీరు పోస్తూ 10 నుంచి 15 నిమిషాల పాటు సబ్బు లేదా డెటాల్తో శుభ్రం చేయాలని సూచించారు. గాయానికి కుట్లు వేయడం, బిగుతుగా బ్యాండేజ్ కట్టడం, చెట్ల పసరు, పసుపు లేదా నూనె రాయడం వంటివి చేయకూడదని తెలిపారు. తక్షణమే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి డాక్టర్ సలహా మేరకు ఏఆర్వీ వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. వ్యాధి తీవ్రతను బట్టి రేబిస్ ఇమ్యునోగ్లోబులిన్ ఇవ్వడం జరుగుతుందని, కాబట్టి వీలైనంత త్వరగా వైద్యుడిని సంప్రదించాలని తెలిపారు.
శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ స్వామి మాట్లాడుతూ వైద్య సిబ్బంది సూచనలను ప్రతి ఒక్కరూ పాటిస్తూ ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది, వైద్య సిబ్బంది, సీహెచ్ఓ లీలావతి, హెల్త్ ఎక్స్టెన్షన్ అధికారి బాదం రాజేశ్వర్, హెల్త్ సూపర్వైజర్లు గోవిందు, సుజాత, ఏఎన్ఎంలు పి. మల్లిక, సరస్వతి, ఆర్బీఎస్కే వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు ఎస్. వరలక్ష్మి, డి. విజయ, లీల, షమీం, జి. పార్వతి, జయమ్మ తదితరులు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


